YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

చంద్రబాబును టార్గెట్ చేసిన మోత్కుపల్లి

చంద్రబాబును టార్గెట్  చేసిన మోత్కుపల్లి
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎదుర్కొంటున్న కష్టాలకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. అటు ఆంధ్రాపైనా దీని ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తిరుగుబాటును పార్టీ సీరియస్ గానే పరిగణించింది. ఆయనను బహిష్కరించింది. కానీ కథ అంతటితో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్లుగా చంద్రబాబునాయుడిని దుమ్మెత్తిపోసే బాధ్యతను ఆపార్టీ నాయకులకే వదిలేశారు కేసీఆర్. గవర్నర్ పదవి వస్తుందనే భ్రమలో నిన్నామొన్నటివరకూ బాబుకు విశ్వాసపాత్రునిగా ఉంటూ వచ్చారు మోత్కుపల్లి. కేసీఆర్ తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రాజధానిని అమరావతికి మార్చినప్పటినుంచి సీనియర్ నాయకులకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవం కల్ల అని వారికి తెలిసిపోయింది. దీంతో రెండువర్గాలుగా పార్టీని ఇరుమార్గాలవైపు తీసుకెళ్లాలని నాయకులు భావించారు. మోత్కుపల్లి వంటి సీనియర్లు టీఆర్ఎస్ వైపు పావులు కదిపారు.కేసీఆర్ ను ఆగర్భశత్రువుగా భావించే రేవంత్ రెడ్డి వంటివారు కాంగ్రెసుకు సన్నిహితం చేయాలని చూశారు. చంద్రబాబు నాయుడు ఎటువైపు మొగ్గు చూపలేదు. దీంతో రేవంత్ తనదారి తాను చూసుకున్నారు. కాంగ్రెసులో చేరిపోయారు. ఇక లైన్ క్లియర్ అని బావించిన టీఆర్ఎస్ వర్గాలు టీడీపీ తమలో విలీనమై పోతే బాగుంటుందని యోచించారు. కేసీఆర్ వంటివారి ఆలోచనలు గ్రహించి మోత్కుపల్లి ఆ దిశలో ఒక ప్రకటన కూడా చేశారు. అక్కడ ఉన్నది కూడా అంతా తెలుగుదేశం వాళ్లేకాబట్టి టీఆర్ఎస్ లో విలీనం చేసేయాలని బహిరంగంగా సూచించారు. చంద్రబాబు నాయుడు మోత్కుపల్లిని అప్పట్నుంచే దూరంగా ఉంచుతున్నారు. దాంతో కేసీఆర్ వ్యూహం ఫలించలేదు. మోత్కుపల్లి తప్పనిసరిగా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది.ఈ ధోరణిని అనుసరించే వ్యక్తులింకెందరున్నారు? అసలు హఠాత్తుగా మోత్కుపల్లికి అధిష్ఠానంపై ఆగ్రహమెందుకు వచ్చిందని పార్టీ నాయకులు మథనపడుతున్నారు. మరోవైపు ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సమంజసమైనవే కదా? అంటూ కొందరు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. టీడీపీపై అక్కసుతో ఉన్న ప్రతిపక్షాలు మాత్రం భలే జరిగిందంటూ సంబరపడిపోతున్నాయి. ఏతావాతా నరసింహుల ఉగ్రతాండవం తెలుగుదేశంలో ప్రకంపనలే సృష్టించింది. పార్టీగా టీడీపీకి పరీక్షే కాకుండా నాయకుల ఇంటిగ్రిటీ ఏ స్థాయికి దిగజారుతుందో కూడా వెల్లడించింది.అయిదుసార్లు శాసనసభ్యునిగా పనిచేసి, మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించిన మోత్కుపల్లి టీడీపీలో సీనియర్ నేత. ఎన్టీరామారావుకు ఆత్మీయునిగా మెలిగారు. చంద్రబాబు నాయుడికీ సన్నిహితుడే. అందుకే మోత్కుపల్లిని గవర్నర్ గా పంపాలని చంద్రబాబు నాయుడు భావించారు. లేదంటే రాజ్యసభ సభ్యత్వానికి సైతం పూచీకత్తు నిచ్చారు. కానీ రెండూ జరిగే అవకాశాలు లోపించాయి. టీడీపీ , కేంద్రం నుంచి బయటికి వచ్చేయడంతో గవర్నర్ పదవికి గండిపడిపోయినట్లే. తెలంగాణలో తెలుగుదేశం నానాటికీ క్షీణిస్తూ ఉండటంతో ఆ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు లోపించినట్లే. తనకూ ప్యూచర్ నిల్. కనీసం టీఆర్ఎస్ తో పొత్తు ఉంటే సీటు దక్కుతుంది. గెలుపు సాధ్యమవుతుందనుకున్నారు. తాజా పరిణామాల వల్ల అదీ కష్టసాధ్యమని తేలిపోయింది. దీంతో మోత్కుపల్లికి వాస్తవం కళ్లకు కట్టినట్లయింది. టీడీపీని విడిచిపెట్టడం అనివార్యంగా కనిపించింది. చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయి విమర్శలతో అడుగుబయటపెట్టారు. అయితే ఇంతకాలం పల్లకి మోసి సడన్ గా విసిరికొట్టడమే విమర్శలకు కారణమవుతోంది.తెలంగాణలో టీడీపీని, చంద్రబాబునాయుడిని కార్నర్ చేసేందుకు మోత్కుపల్లి పక్కా వ్యూహమే ఎంచుకున్నారు. మాదిగలకు ప్రయోజనం కల్పించే విధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆంధ్రా అసెంబ్లీ ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. దీంతో తెలంగాణలో టీడీపీకి అండగా ఉన్న మాదిగలను దూరం చేయాలనే ఎత్తుగడ వేశారు. అదే సమయంలో ఆంధ్రాలో మూడు నుంచి నాలుగు శాతం వరకూ ఉన్న మాదిగల ఓట్లు కూడా టీడీపీకి చేరువ కాకుండా చేసే యత్నమే ఈ ప్రకటన. గతంలో రిజర్వేషన్ల వర్గీకరణ ను టీడీపీ బలంగా సమర్థించింది. చంద్రబాబు నాయుడి హయాంలో కొంతకాలంపాటు వర్గీకరణను అమలు చేశారు. సుప్రీం కోర్టు కొట్టివేయడంతో అది ఆగిపోయింది. రాష్ట్రవిభజన తర్వాత టీడీపీ ఎటూ తేల్చుకోలేని స్థితి. ఆంధ్రాలో అధికసంఖ్యలో ఉన్న మాలలు రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో అధికంగా ఉన్న మాదిగలు రిజర్వేషన్ల వర్గీకరణపై ఉద్యమాలు చేస్తున్నారు. గతంలో తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్లను సమర్థించిన టీడీపీ ఇప్పుడు ఏపీలో పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం మౌనం వహించకతప్పడం లేదు. రాజ్యసభ సీట్లను చంద్రబాబు నాయుడు డబ్బున్నవాళ్లకే ఇచ్చారు. పేదలకు రాజ్యసభ స్థానమిచ్చి కేసీఆర్ సామాజిక న్యాయం చేశారంటూ మోత్కుపల్లి లేవనెత్తిన అభ్యంతరం పార్టీలోనూ చర్చనీయమవుతోంది. టీడీపీ వైఖరిలో మార్పుపై మోత్కుపల్లి విమర్శలు సహేతుకమే. కానీ టైమింగ్ విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు తనకు ఏమీ చేయలేడని స్పష్టమైన తర్వాతనే హఠాత్తుగా బాబులో విలన్ కనిపించడం మోత్కుపల్లి రాజకీయ దివాళాకోరుతనమనేందుకు ఆస్కారం కల్పించింది. =

Related Posts