విజయవాడ, ఫిబ్రవరి 16,
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనేక ఈక్వేషన్లు రాజకీయంగా పార్టీలను దగ్గర చేస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక ఈక్వేషన్లు.. బీజేపీకి కూడా పొత్తుపై నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు. ఇటు చంద్రబాబుతో ప్రత్యక్షంగా పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, జగన్ ను మాత్రం దూరం పెట్టలేని పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. అందుకే జాతీయ స్థాయిలో బీజేపీ కొంత ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏ నిర్ణయమైనా జగన్ ను నొప్పించకుండా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మోదీ అండ్ కో పై ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలసి వచ్చినా ఇప్పటి వరకూ పొత్తులపై క్లారిటీ రాలేదు. ఎన్నికల్లో గెలవాలంటే... ఏపీలో నాలుగు పార్లమెంటు స్థానాల్లో గెలవాలంటే టీడీపీతో పొత్తు ఆ పార్టీకి అవసరం. లోపల ఇష్టం ఇద్దరికీ లేకపోయినా ఒకరి అవసరం మరొకరికి ఉంది. వైసీపీతో నేరుగా పొత్తు పెట్టుకునేందుకు అవకాశం లేకపోవడంతో టీడీపీతో అలయన్స్ కు బీజేపీ దిగుతుందనడంలో సందేహం లేదు. పార్లమెంటు స్థానాలనే ఎక్కువ కోరుకుంటుంది. చంద్రబాబు కూడా లోక్‌సభ స్థానాలు ఇచ్చేేందుకు పెద్దగా సంకోచించరు. ఎందుకంటే పార్లమెంటు సభ్యుల కంటే ఆయనకు శాసనసభలో ఎక్కువ మంది గెలవడమే ముఖ్యం. అందుకే ఢిల్లీ పెద్దలు లోక్‌సభ స్థానాల విషయంలో పెట్టిన డిమాండ్లను అంగీకరించేందుకే ఎక్కువ మొగ్గు చూపుతారు. లోక్‌సభ స్థానాల్లో సరైన అభ్యర్థులు కూడా లేరు.ఇక పవన్ కల్యాణ్ తో పొత్తు ఎటూ ఉండనే ఉంది. ఆ పార్టీతో పొత్తు వల్ల యువ ఓటర్లు కొంత పార్టీకి అనుకూలంగా మారతారు. అలాంటి జనసేనతో కొంత అనుకూల వాతావరణం ఉండనుందన్న అంచనాలు ఉన్నాయి. పవన్ వల్ల భవిష‌్యత్ లో పార్టీకి ఉపయోగం ఉంటుందని, దక్షిణాదిలో ఆయన ఫేమ్ ఉపయోగపడుతుందని కూడా కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే పవన్ తో సఖ్యతను కమలం కాదనుకోలేదు. వదులకోలేదు. పవన్ కూడా అంతే. మోదీ అంటే తనకు పిచ్చ అభిమానమన్న పవన్ కల్యాణ్ బీజేపీని దూరం చేసుకునేందుకు కూడా సిద్ధంగా లేరు. ఆయన బేషరతుగానే బీజేపీకి మద్దతుగా ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. . ఏమాత్రం తేడా జరిగినా ఇక అంతే రాజ్యసభలో బలం పెరగడంతో... ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీని వదులుకోవాలని బీజేపీ కేంద్రం పెద్దలు భావించరు. రాజ్యసభలో ఇప్పుడు వైసీపీ బలం 11 మందికి పెరిగింది. పెద్దల సభలో బిల్లులు ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతు అవసరం, 2026 వరకూ రాజ్యసభలోకి టీడీపీ కాలు మోపే పరిస్థితి లేదు. అందుకే వైసీపీని పరోక్షంగానైనా ప్రోత్సహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అవసరం రాజ్యసభలో బీజేపీకి ఉంది. అలాగే బీజేపీ మద్దతు కూడా జగన్ కు అంతే అవసరం ఉంటుంది. అందుకే ఎవరినీ ఎవరూ వదులుకునేందుకు సిద్ధంగా లేరు. అదీ ఏపీ పాలిటిక్స్ స్పెషాలిటీ. అందుకే ఏపీ రాజకీయాలు దేశంలో కంటే భిన్నమని వేరే చెప్పక్కర్లేదనుకుంటా.