విజయవాడ, ఫిబ్రవరి 16,
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చినట్లే కనపడుతుంది. ఆమెను రాజ్యసభకు పంపుతామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అందులోనూ ప్రధానంగా కర్ణాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిలను పంపుతారని అన్నారు. అందుకే తెలంగాణలో తాను స్థాపించిన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారంటారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి అంతటితో సరిపెట్టుకున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రకటించిన జాబితాలో ఆమె పేరు లేదు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు డీకేతో జరిగిన చర్చల్లో.... తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఉన్నా ఆమెకు స్థానం ఇవ్వరు. ముందు నుంచి కర్ణాటక నుంచి వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపాలన్న యోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు ప్రచారం జరిగింది. వైఎస్ షర్మిల కూడా ప్రత్యక్ష ఎన్నికలలో కాకుండా పెద్దల సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారన్న వార్తలు వచ్చాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో గతంలో వైఎస్ షర్మిల జరిపిన చర్చలలో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆమెను పంపే ప్రతిపాదన కూడా వచ్చిందన్నారు. కర్ణాటక నుంచి... కానీ తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. అజయ్ మాకెన్, హుస్సేన్, చంద్రశేఖర్ పేర్లు మాత్రమే కర్ణాటక కోటాలో ఇచ్చింది. ఇందులో షర్మిలకు చోటు లేదు. పీసీీసీ చీఫ్ పదవి చేపట్టిన తర్వాత రాజ్యసభ కూడా వస్తే ప్రొటోకాల్ కు కూడా కొదవ ఉండదని ఆమె భావించారు. తన కుమారుడు వివాహం ఈ నెల 17వ తేదీన జరుగుతుండగా, అంతకు ముందే తాను రాజ్యసభకు ఎన్నికవుతానని భావించిన షర్మిలకు కాంగ్రెస అధినాయకత్వం షాక్ ఇచ్చినట్లయింది. ఆమెకు వచ్చే విడతలోనైనా రాజ్యసభకు పంపుతారా? లేదా? పీసీసీ చీఫ్ పదవితో సరిపెడతారా? అన్నది తేలాల్సి ఉంది. కానీ షర్మిల మాత్రం ఈ విషయంలో మరొకసారి పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశముందని అంటున్నారు.