YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

27 దేశాల్లో సీబీఎస్ఈ పరీక్షలు

27 దేశాల్లో  సీబీఎస్ఈ పరీక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16,
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 15 మార్చి 13 వరకు పదోతరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వ‌ర‌కు 12వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మన దేశంతోపాటు 27 దేశాల్లో ఈ పరీక్షలకు 39 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. దేశరాజధాని ఢిల్లీలో 877 కేంద్రాల్లో 5.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.దేశ రాజధానిలో రైతుల దిల్లీ చలో ఆందోళన నేపథ్యంలో.. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కాబట్టి విద్యార్థులు ఇంటి నుంచి త్వరగా బయలుదేరి పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సీబీఎస్‌ఈ అధికారులు సూచించారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని, ఇతర దేశాల్లోని విద్యార్థులూ 10 గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది. స్థానిక పరిస్థితులు, ట్రాఫిక్‌, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా రావాలని సూచించింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ విషయంలో అన్ని పాఠశాలలు సాయం చేయాలని పేర్కొంది.ప‌రీక్షకు ప‌రీక్షకు మ‌ధ్య గ్యాప్ ఇవ్వడంతోపాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ ప‌రీక్షల తేదీల‌ను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను రూపొందించారు. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి, ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్‌ పేపర్‌ను ఫిబ్రవరి 28కి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్‌, ఫ్రెంచ్‌ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్‌, ఫిబ్రవరి 23న టిబెటన్‌ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కేవలం ఫ్యాషన్‌ స్టడీస్‌ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21కి మార్చారు. పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల విధానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే పరీక్షలను రెండుసార్లు రాయాలా లేదా ఎప్పటిలా ఒకేసారి రాయాలా అనేది విద్యార్ధుల ఇష్టమని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఐచ్ఛికం. విద్యార్థులు రెండు సార్లు తప్పనిసరిగా రాయాలన్న నిర్భంధమేమీ లేదని తెలిపింది. ఒకవేళ రెండు సార్లు పరీక్షలు రాస్తే.. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే.. ఆ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో, అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో పాల్గొంటూ సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు రాయలేని విద్యార్థుల కోసం సీబీఎస్ఈ బోర్డు ప్రత్యేక పరీక్షలను నిర్వహించాలని కూడా కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం రాతపరీక్షలకు మాత్రమే వర్తిస్తుంది. కంపార్ట్‌మెంట్, ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా పరీక్షలను మాత్రం అందరితో కలిపే రాయాల్సి ఉంటుంది. క్రీడలు, ఎడ్యుకేషన్ పోటీల్లో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకే విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Related Posts