YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, ఫిబ్రవరి 16,
వేసవి మొదలుకాక ముందే తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత కొనసాగుతుండగా...మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత పెరుగుతుంది. బుధవారం నుంచి ఎండల ప్రభావం పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. రేపటి నుంచి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేడి గాలులు విస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌(Hyderabad)లో 36- 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాది ఎండలు దెబ్బ భాగ్యనగర్ వాసులు అల్లాడిపోయారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోయాయి. ఇదే తరహా ఈ ఏడాది ఎండల తీవ్రత ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ఉక్కపోత మొదలవుతుంది. మార్చి నెల ప్రారంభం నుంచి ఎండల తీవ్రత పెరుగుతూ... ఏప్రిల్, మే నెల భానుడు ప్రతాపం చూపుతాడు. అయితే ఈఏడాది సూర్యుడు కాస్త ముందుగానే చెమటలు పట్టిస్తున్నాడు. తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో పలు జిల్లాల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతల పెరుగుదలలో ఇదే గరిష్ఠమని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆదిలాబాద్‌లో 31.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా, గత వారంలో 36 డిగ్రీలుగా ఉష్టోగ్రతలు చేరాయి. ఖమ్మంలో సైతం 35 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌లో కూడా ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ లో సాధారణం కంటే 3.7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.ఏపీలోనూ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. క్రమేపీ ఎండలు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి సాధారణం కంటే 3 నుంచి 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నట్లు పేర్కొంది. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, కడప జిల్లాల్లో ఇప్పటికే 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు నమోదు అవుతాయి. కానీ గత వారం రోజులుగా ఈ ఉష్ణోగ్రతలను మించి ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తుంది. ఏపీలో ఫిబ్రవరి మూడో వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుందని అధికారులు భావిస్తు్న్నారు. ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో బలంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

Related Posts