YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశంలో ఏడో జాబితా ప్రకంపనలు

ప్రకాశంలో ఏడో జాబితా ప్రకంపనలు

ఒంగోలు, ఫిబ్రవరి 19
వైసీపీ ఏడో లిస్టు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను ఉలిక్కిపడేలా చేసింది. రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు ముఖ్యులను పక్కన పెట్టడమే కాకుండా.. అనూహ్యంగా కొత్తవారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడం హాట్‌టాపిక్‌గా మారింది. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి సీటు దక్కదనే ప్రచారం ఎప్పటినుంచో ఉన్నా… పర్చూరు వద్దనుకున్న ఆమంచికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకపోవడమే చర్చకు తావిస్తోంది.కేవలం రెండు పేర్లతో విడుదలైన వైసీపీ ఏడో లిస్టు అధికార వైసీపీలో విస్తృత చర్చకు దారి తీస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఒక్క జాబితాలో ఇద్దరు నేతలు, మూడు నియోజకవర్గాల సమస్యను సెటిల్‌ చేసింది వైసీపీ.. ఐతే ఈ మార్పులు ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ఎఫెక్ట్‌ చూపుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీటు దక్కని ఇద్దరు కూడా ప్రముఖులే కావడంతో… రాజకీయంగా వారు ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారనే ఉత్కంఠ రేపుతోంది.చడీచప్పుడు లేకుండా వైసీపీ విడుదల చేసిన ఏడో జాబితాలో పర్చూరు ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి సీట్లు కోల్పోయారు. ఇందులో మహీధర్‌రెడ్డికి ఈ సారి చాన్స్‌ లేనట్లేనని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. ఐతే ఆయన స్థానంలో ఎవరు వస్తారనేదే ఇన్నాళ్లు సస్పెన్స్‌… ఇప్పుడు ఆ ఉత్కంఠ తొలగిపోయింది. మహీధర్‌రెడ్డి స్థానంలో నెల్లూరు జిల్లాకు చెందిన విద్యా సంస్థల అధినేత, బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద యాదవ్‌ను తెరపైకి తేవడం సంచలనం సృష్టిస్తోంది.ఇప్పటివరకు నియోజకవర్గానికి పరిచయం లేని అరవిందను.. కేవలం బీసీ.. అందునా యాదవ సామాజికవర్గం కోణంలో సీటు కేటాయించడం వెనుక ప్రత్యేక వ్యూహం దాగుందని అంటున్నారు పరిశీలకులు. అంతేకాకుండా.. కొత్త ఇన్‌చార్జిని ప్రకటించే సమయంలో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, అరవింద కలిసివున్న ఫొటో బయటపెట్టడం కూడా వ్యూహమే అంటున్నారు. అరవింద వైసీపీలో చేరినప్పుడు తనను పిలిచారని… తీరా తనకు తెలియకుండా తన నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహీధర్‌రెడ్డి.1989 నుంచి కందుకూరు నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్న మహీధర్‌రెడ్డి.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు సడన్‌గా తప్పుకోమని పార్టీ ఆదేశించడంతో ఆయన భవిష్యత్‌పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్న మహీధర్‌రెడ్డి పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటారా? లేక ప్రత్యామ్నాయం చూసుకుంటారా? అనేది ఆసక్తి రేపుతోంది. తనకు సీటు దక్కదనే ప్రచారం మొదలైన నుంచి రామాయపట్నం పోర్టు నిర్వాసితులతో కలిసి ఆందోళన బాటపట్టిన మహీధర్‌రెడ్డి పరోక్షంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నట్లేనని అంటున్నారు.ఇదేవిధంగా పర్చూరులో మార్పు కూడా విస్తృత చర్చకు దారితీసింది. వాస్తవానికి పర్చూరులో ఇన్‌చార్జిగా ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తొలి నుంచి ఆ బాధ్యతలపై విముఖంగానే ఉన్నారు. తన సొంత నియోజకవర్గం చీరాల మళ్లీ కేటాయించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. పర్చూరులో టీడీపీ.. ఆ పార్టీకి అనుకూలంగా కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండటంతో… అక్కడ గెలుపు అంత ఈజీ కాదని గ్రహించిన ఆమంచి ఎప్పటి నుంచో సీటు మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే చీరాలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కరణం బలరాం కారణంగా కృష్ణమోహన్‌ ఆశలు ఫలించలేదు. పేరుకు పర్చూరు ఇన్‌చార్జిగా పనిచేస్తున్నా… ఆయన మనసంతా చీరాల చుట్టూనే తిరుగుతుండటంతో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ.. ఐతే అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా అమెరికాలో ఉన్న టీడీపీ మాజీ నేత యెడం బాలజీకి పర్చూరు ఇన్‌చార్జిగా నియమించడం క్యాడర్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.2014లో చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యెడం బాలాజీ… ఆ ఎన్నికల్లో ఓటమితో టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ దక్కకపోవడంతో వ్యాపార రీత్యా అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం స్థానిక రాజకీయాలకు దూరంగా ఉన్న బాలాజీని గుర్తు చేసుకుని మరీ పిలిపించి ఇన్‌చార్జి సీటు కట్టబెట్టారు సీఎం జగన్‌. పర్చూరులో కమ్మ సామాజిక వర్గం తర్వాత కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. కాపులతోపాటు ఎస్సీ, ఎస్టీల ఓట్లు తమ పార్టీకి పడతాయనే అంచనాతో యెడం బాలాజీని రంగంలోకి దింపారు సీఎం జగన్‌ఈ రెండు మార్పులతో ప్రకాశం రాజకీయంపై హాట్‌ హాట్‌ డిబేట్‌ జరుగుతోంది. కందుకూరులో సీనియర్‌ నేతను తప్పించడం… పర్చూరు నుంచి ఆమంచికి విముక్తి కల్పించి ఇంకా ఎక్కడా సీటు కేటాయించకపోవడంతో చీరాల రాజకీయం గరం గరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. చీరాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి గత ఎన్నికల్లో ఓడిపోయారు. తనకు బలమైన వర్గం ఉన్న చీరాల నుంచే మళ్లీ గెలవాలని బలంగా కోరుకుంటున్న కృష్ణమోహన్‌.. పర్చూరు ఇన్‌చార్జిగా ఉన్నా.. చీరాల రాజకీయాల్లో తలదూర్చేవారు. దీంతో అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కరణం వర్గీయులతో పలుమార్లు వివాదాలు జరిగాయికొన్నాళ్లుగా ఈ తగాదాలు పెద్దగా లేకపోయినా… ఇప్పుడు ఆమంచి ఖాళీ అవడంతో చీరాలలో మళ్లీ గ్రూప్‌ ఫైట్‌ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆమంచి సోదరుడు స్వాములు ఇక్కడి నుంచి జనసేన తరపున పోటీ చేయనున్నారనే ప్రచారం కూడా హీట్‌ పుట్టిస్తోంది. స్వాములు పోటీ చేస్తే.. ఆమంచి కృష్ణమోహన్‌ ఎలాంటి వైఖరి తీసుకుంటారు? ఆయన వైసీపీలో కొనసాగుతారా? లేక సోదరుడికి బాసటగా నిలుస్తారా? అనేది తేలాల్సివుంది. మొత్తానికి రెండు మార్పులు… ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. 

Related Posts