YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పిఠాపురంలో హాట్.. సీట్...

పిఠాపురంలో  హాట్.. సీట్...

కాకినాడ, ఫిబ్రవరి 19
పిఠాపురం సీటు ఎందుకంత హాటు? ఇక్కడ గెలుపుపై పార్టీల ధీమా వెనుక కారణమేంటి? సిట్టింగ్‌ ఎమ్మెల్యేను తప్పించిన వైసీపీ.. పిఠాపురంలో వన్స్‌మోర్‌ నినాదంతో దూసుకుపోతుండగా, కూటమి కట్టిన టీడీపీ-జనసేన కూడా విజయంపై చాలా ధీమాగా ఉన్నాయి. పొత్తుల్లో ఏ పార్టీకి సీటు ఇచ్చినా విజయం మాత్రం పక్కా అంటున్నాయి. ఇలా రెండు పక్షాలు.. విజయంపై నమ్మకం పెంచుకోవడంతో పిఠాపురంలో పొలిటికల్‌ పిక్చర్‌ రక్తి కట్టిస్తోంది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం రాజకీయం వేడి పుట్టిస్తోంది. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాపుల ఇలాఖాలో విజయం సాధించి.. ఆ వర్గంలో తన బలం చెక్కుచెదరలేదని నిరూపించుకోవాలని వ్యూహం రచిస్తోంది వైసీసీ. దీనికి తగినట్టుగానే సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కన పెట్టేసి.. కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దింపాలని ప్లాన్‌ చేసింది.గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గీతకు ఇక్కడ మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో ఆమె విజయం నల్లేరుపై నడకగా భావిస్తోంది. ఐతే సిట్టింగ్‌ ఎమ్మెల్యే దొరబాబు సహకారం లేకుండా గీత విజయం సాధించగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా సరే కాపు సామాజికవర్గం.. అందునా మహిళా నాయకురాలు కావడంతో విక్టరీ కొట్టడం ఈజీ అని ధీమా ప్రదర్శిస్తోంది వైసీపీ.ఇక పిఠాపురం నుంచి జనసేనాని పవన్‌ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా పిఠాపురంపై అంచనాలు పెంచేసింది. జనసేనాని సొంత సామాజికవర్గం ఎక్కువగా ఉన్న పిఠాపురం అయితే ఈజీగా గెలుస్తారని ఆ పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఈ సీటు ఆశిస్తుండటంతో పిఠాపురం వీఐపీ నియోజకవర్గంగా మారిపోయింది. పవన్‌ పోటీ చేయకపోయినా, 70వేల కాపుల ఓట్లు ఉన్న పిఠాపురం జనసేనకే కేటాయించాలని ఆ పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఐతే ఈ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం వదుకోకూడదనే పట్టుదల ప్రదర్శిస్తుండటంతో కూటమి రాజకీయం కాకరేపుతోంది.పిఠాపురంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ కూడా బలమైన నేత. 2009లో స్పల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వర్మ.. 2014లో టీడీపీ టికెట్‌ నిరాకరిస్తే స్వంత్రంగా పోటీ చేసి గెలిచారు. ఇక గత ఎన్నికల్లో ఓడినా.. నాలుగున్నరేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఈసారి ఎలాగైనా టీడీపీ సింబల్‌పై పోటీ చేసి గెలవాలని బలంగా కోరుకుంటున్నారు వర్మ. పార్టీ తనను కాదని జనసేనకు కేటాయిస్తే.. స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ఆయన అంతర్గతంగా చెబుతుండటం హీట్‌ పుట్టిస్తోంది. జనసేనకు కేటాయించాల్సి వస్తే.. పవన్‌ మాత్రమే పోటీ చేయాలని.. పవన్‌ గెలుపునకు సంపూర్ణంగా సహకరిస్తానని కూడా వర్మ చెబుతుండటంతో పార్టీ డైలమాలో పడింది.ఇక ఇప్పటికే రాజోలు, రాజానగరం నుంచి పోటీ చేస్తామని జనసేనాని పవన్‌ ఇప్పటికే ప్రకటించారు. పిఠాపురంలో పవన్‌ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగినా.. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే పవన్‌ మళ్లీ భీమవరం నుంచి పోటీకి దిగేలా కనిపిస్తోంది. ఇక ముద్రగడ జనసేనలో చేరతారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ లేదు. టీడీపీ-జనసేన నేతలు ముద్రగడతో గతంలో సంప్రదించినా.. ముద్రగడ అడుగులు జనసేన వైపు ఇంకా పడలేదు. ఎన్నికల ముందు ముద్రగడ వస్తే.. ఆయనకు సీటు కేటాయిస్తారా? లేక ప్రచారానికే వాడుకుంటారా? అన్నది తేలాల్సివుంది.ఇదే సమయంలో జనసేన నుంచి పోటీకి యువనేత ఉదయ శ్రీనివాస్‌ ఉవ్విళ్లూరుతున్నారు. ఐతే ఇక్కడ వర్మ లేదా పవన్‌ పోటీ చేస్తేనే గట్టిపోటీ ఇవ్వగలరనే వాదన వినిపిస్తోంది. మరోవైపు టీడీపీ-జనసేన మధ్య పిఠాపురం సీటు విషయంలో సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున యుద్ధం జరుగుతోంది. సహనం కోల్పోయి పరస్పరం విమర్శలు గుప్పించుకోవడం హీట్‌ పుట్టిస్తోంది. ఇలా పిఠాపురం పీఠం చాలా హాట్‌గా మారిపోవడం.. సీట్ల సర్దుబాటు వరకు ఇదే టెంపరేచర్‌ కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

Related Posts