విశాఖపట్టణం, ఫిబ్రవరి 19
ఏపీలో విశాఖ పార్లమెంట్ స్థానం కీలకం. కానీ స్థానికేతరులే అక్కడ ఎంపీగా ఎన్నిక కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా స్థానికేతరులే అభ్యర్థులుగా ఉన్నారు. టిడిపి నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, వైసిపి నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేయడం దాదాపు ఖాయంగా తేలింది. ఒకవేళ పొత్తులు భాగంగా బిజెపికి సీటు ఇచ్చినా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బరిలో దిగే అవకాశం ఉంది. అయితే ఆమె సైతం స్థానికేతురాలు కావడం విశేషం.ఇటీవల విశాఖలో కొన్ని సంఘాలు స్థానిక అంశం తెరపైకి తెచ్చినా.. రాజకీయ పార్టీలు లైట్ తీసుకున్నాయి. స్థానికేతురులకే టిక్కెట్లు కట్టబెట్టాయి.విశాఖ ఎంపీగా బాట్టం శ్రీరామమూర్తి చివరి లోకల్ కాండేట్ గా నిలిచిపోయారు. అటు తరువాత స్థానికేతురులే ఎంపీలుగా పోటీ చేయడం, ప్రాతినిధ్యం వహించడం ఆనవాయితీగా వస్తోంది. కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి, ఎంవివిఎస్ మూర్తి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు, ప్రస్తుత సిట్టింగ్ ఎంపి ఎంవివి సత్యనారాయణ.. ఇలా అందరూ స్థానికేతరులే. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు. అయితే విశాఖ ఎంపీగా ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం వారి ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఎంవివిఎస్ మూర్తి, కంభంపాటి హరిబాబు, పురందేశ్వరి, సిట్టింగ్ ఎంపీ సత్యనారాయణ.. వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేదురు మల్లి జనార్దన్ రెడ్డి, సుబ్బిరామిరెడ్డిలు సైతం ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే వైసిపి విజయనగరం జిల్లాకు చెందిన బొత్స ఝాన్సీ లక్ష్మి అనూహ్యంగా ఎంపిక చేసింది. ఆమెను స్థానికురాలుగా ప్రమోట్ చేస్తోంది. అటు టిడిపి నుంచి వచ్చిన భరత్ ను మాత్రం స్థానికేతరుడుగా చిత్రీకరిస్తోంది. అయితే ఆమె విజయనగరం ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. అటువంటి ఆమె విశాఖకు లోకల్ ఎలా అవుతారని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.భరత్ గీతం విద్యాసంస్థల అధినేత. మాజీ ఎంపీ ఎంవివి ఎస్ సత్యనారాయణ మనుమడు. ఈ కుటుంబం గత ఐదు దశాబ్దాలుగా విశాఖలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. రాజమండ్రి నుంచి వలస వచ్చింది. ఇక్కడే ఉంటూ వస్తున్న భరత్ ఎలా స్థానికేతరుడు అవుతాడని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కానీ వైసిపి ఒక వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చారని.. ఈసారి మాత్రం కాపులకు ప్రాధాన్యం ఇచ్చి ఓట్లు వేయాలని ప్రజలను కోరుతోంది. అయితే 2014లో సైతం వైఎస్ విజయమ్మ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కడప నుంచి దిగుమతి చేసుకున్నారని.. విశాఖలో రాయలసీమ సంస్కృతి
పెరుగుతుందని టిడిపి నేతలు ప్రచారం చేశారు. దీంతో విజయమ్మకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు బొత్స ఝాన్సీ లక్ష్మీ విషయంలో కూడా అదే తరహా ప్రచారం సాగుతోంది. బొత్స హవా విశాఖలో పెరుగుతుందని సొంత పార్టీ శ్రేణులే ఆందోళన చెందుతున్నాయి. ఈ తరుణంలో ఝాన్సీ లక్ష్మీ గెలుపు పై అనుమానాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.