లక్నో, ఫిబ్రవరి 19,
ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిగో ప్రాంతంలోని 10 ఏళ్ల బాలిక తనకు కలలో కృష్ణుడు కనిపించాడని పేర్కొంది. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని భూగర్భంలో పాతిపెట్టారని బాలిక తెలిపింది. బాలిక కలను నమ్మి మట్టి తవ్విన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన ప్రదేశంలో దేవుడి విగ్రహం దొరికింది.నిగోహి ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన వినోద్ సింగ్ కుమార్తె పూజకు ఒక కల వచ్చింది. పూజ కలలో జింద్‌పూర్ గ్రామంలోని కాలువ సమీపంలోని మతపరమైన ప్రదేశం సమీపంలో భూమిలో విగ్రహం ఉందని కనిపించింది. తన కల గురించి కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. అయితే పూజ కలను కొట్టి పడేస్తూ.. కుటుంబ సభ్యులతో సహా ఎవరూ ఆమె మాటను పట్టించుకోలేదు. దీంతో పూజ తనకు వచ్చిన కలను నిజమని నమ్మింది. దీంతో పూజ తాను చెప్పిన ప్రాంతాల్లో మట్టిని తవ్వి విగ్రహాన్ని బయటకు తీసేంత వరకు ఏమీ తినను అంటూ నిరాహార దీక్ష చేపట్టింది. అలా గత ఏడు రోజులుగా నిరాహార దీక్షలో పూజ కూర్చుంది. దీంతో ఆమె మాటలు నమ్మిన వినోద్ కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి దర్గా దగ్గరకు చేరుకున్నారు. తవ్వకాల సమయంలో ఇతర సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా దర్గా దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువైపుల ప్రజలు తరలివచ్చిన తర్వాత తవ్వకాలు కొనసాగాయి. కొంత తవ్విన తర్వాత శ్రీకృష్ణుడి విగ్రహం కనిపించింది. అనంతరం ఆ విగహాన్నిగ్రామస్తులు అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని పొలంలో ప్రతిష్ఠించారు.