YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

20 లక్షల దరఖాస్తులు

20 లక్షల దరఖాస్తులు

హైదరాబాద్, ఫిబ్రవరి 19
‘తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదు. తాము అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డులు జారీ చేస్తాం’ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు చెప్పిన మాటలు ఇవీ. అధికారంలోకి వచ్చి 70 రోజులు గడిచినా.. ప్రభుత్వం మాత్రం రేషన్‌ కార్డుల జారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రోజుకో అప్‌డేట్‌ వినిపిస్తున్నా.. అన్ని పథకాలకు అవసరమయ్యే రేషన్‌ కార్డుల జారీపై ప్రభుత్వం మాత్రం అధికారిక ప్రకటన జారీ చేయడం లేదు. దీంతో ఇప్పటికే అభయహస్తం దరఖాస్తు చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు.కొత్త రేషన్‌ కార్డులు ఎప్పటి నుంచి వస్తాయి.. ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశంపై చాలా మందిలో గందరగోళం నెలకొంది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం కనీసం దరఖాస్తుల స్వీకరణ ప్రకటన కూడా రావడం లేదు. ఎమ్మెల్యేలు అదిగో.. ఇదిగో అని ప్రకటిస్తున్నారు. కానీ, అధికారిక ఉత్తర్వులు మాత్రం రావడం లేదు. కనీసం దరఖాస్తులు అయినా స్వీకరించాలని అర్హులు కోరుతున్నారు. కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రస్తుతం సుదీర్ఘ ప్రక్రియ. దరఖాస్తులు స్వీకరించడం ఒక ఎత్తు అయితే.. అర్హులను ఎంపిక చేయడం కత్తిమీద సామే. నిబంధనల రూపకల్పన,అర్హుల గుర్తింపు, పైరవీలు, ఇంటింటి సర్వే.. అనర్హుల తొలగింపు వంటి అంశాలు చాలా కీలకం. ప్రస్తుతం రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తే భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. వాటి స్క్రుటినీ కష్టతరంగా మారనుంది.ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు రేషన్‌ కార్డు తప్పనిసరి చేసింది. ప్రస్తుతం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్‌తోపాటు, ఆరోగ్యశ్రీ, యువతులకు స్కూటీలు, ఇందిరమ్మ ఇళ్లకు రేషన్‌ కార్డు తప్పనిసరి చేసింది. ఇటీవల అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ సమయంలోనూ రేషన్‌కార్డు జిరాక్స్‌ జత చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డు లేరివారు తాము పథకాలకు అర్హత కోల్పోతామని ఆందోళన చెందుతున్నారుమరోవైపు ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో 20 లక్షల మంది తమకు రేషన్‌ కార్డు కావాలని దరఖాస్తుపై పేర్కొన్నారు. ప్రత్యేక ఫాం ఏమీ లేదని ప్రభుత్వం తెలుపడంతో ప్రజాపాలన దరఖాస్తుపైనే చాలా మంది రేషన్‌ కార్డు కావాలని అర్జీ పెట్టారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాత్రం స్పష్టత లేదు.

Related Posts