2019 విజయం అత్యంత అవసరం.. ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్‌కు.. ఇటు ఏపీలో తెలుగుదేశం పార్టీ రెండింటికీ ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే అని చెప్పాలి. ఓ విధంగా ఈ రెండు పార్టీల మనుగడకు.. ఉనికి నిలబడేందుకు విజయం సాధించి తీరాల్సిన ఎన్నికలు. ఎందుకంటే.. పదేళ్లపాటు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి.. సీనియర్ నేతలను కోల్పోయింది. ఆర్ధికంగా.. అంగబలాన్ని నష్టపోయింది. పైగా అధికార పార్టీల.. విపక్షాలను బలహీనపరచటమే పనిగా పెట్టుకున్నాయి. దీనివల్ల పవర్‌లోకి రాగానే.. విపక్షాలను బలహీనపరచటానికే ప్రాధాన్యతనిస్తున్నాయి. నయానో.. భయానో.. లొంగదీసుకుంటున్నాయి. ఏపీ ఉమ్మడ రాష్ట్రంగా ఉన్నపుడు వైఎస్సార్ చేసింది అదే.. ఆ తరువాత టీడీపీ అధినే చంద్రబాబు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే మార్గంలో.. తమ పార్టీ బలపడటం కంటే.. పక్క పార్టీ పునాదులను కదిలించేందుకే ప్రయార్టీ ఇచ్చారనేది.. ఇరువైపులా సీఎంల.. వలస నేతలకు కట్టబెట్టిన మంత్రిపదవులే నిదర్శనం. మరి.. ఇటువంటి కీలకమైన ఎన్నికల్లో టీడీపీ ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లుగా మహానాడు వేదికగా శంఖం పూరించింది.బలం.. బలగం ఉందనే సంకేతాలు ఇవ్వటం మంచిదే కానీ.. క్షేత్రస్థాయిలో అంచనాలు.. విశ్లేషణలకు అందకుండా ఉన్నాయి. పైగా ఈ దఫా ఎన్నికలు పూర్తిగా కుల సమీకరణ నేపథ్యంలోనే సాగనున్నాయి. వైసీపీ రెడ్డి, జనసేన కాపు, టీడీపీ కమ్మ పార్టీలనే భావన ఓటర్లలో బలంగా పాతుకుపోయింది. ఇక సోషల్ మీడియాలో అయితే.. కులపోరు తారాస్థాయికి చేరింది. ఇటువంటి సమయంలో టీడీపీ మరో పార్టీ పొత్తు లేకుండా గెలవగలదా! అనే భావన తెలుగు తమ్ముళ్లలో కూడా ఉంది. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే.. కాంగ్రెస్‌పార్టీ ఒక్కటే మిగిలింది. మొన్న కర్ణాటకలో రాహుల్‌గాంధీతో కరచాలనం.. చంద్రబాబు కొత్త సమీకరణలకు పిలుపు అనే వాదన వినిపించింది. ఇప్పటికే తెలంగాణలో దేశం, హస్తం రెండూ కలిస్తే.. కేసీఆర్‌కు చుక్కలే అనే సందడి మొదలైంది. అయితే ఏపీలో మాత్రం.. నిప్పు..ఉప్పుల్లా ఉన్న రెండు పార్టీలను కలపటం.. కలవాలనుకోవటం కుదరదంటూ సాక్షాత్తూ.. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీల్లో అయితే.. అధినేతల మాటే ఫైనల్. కానీ జాతీయ పార్టీల్లో హైకమాండ్ ఏది చెబితే.. రాష్ట్ర నేతలు.. దానికే జై కొట్టాలి. కాబట్టి.. ప్రస్తుతానికి ఎవరెన్ని వాదనలు వినిపించినా.. విమర్శలు కురిపించినా.. భవిష్యత్తులో హస్తం, సైకిల్ రెండు ఒకేదారిలో నడిచే అవకాశాలు లేకపోలేదనేది విశ్లేషకుల వాదన. తెలుగుదేశం అభిమానులు కూడా.. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో పవర్ కోసం ఎవరితో వెళితే తప్పేమిటంటూ రెండు పార్టీల బంధాన్ని బలపరచటం విశేషం.