విశాఖపట్నం
మిలాన్ 2024కు రంగం సిద్దమైంది. సోమవరం నుంచి పది రోజుల పాటు నేవీ పండుగ విశాఖలో ప్రారంభం జరగనుంది. మిలాన్ లో అతి ముఖ్యమైన సిటీ పరేడ్ కు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. లక్షలాది మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు నేవీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 22న జరిగే సిటిపరేడ్ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్ర పతి మరియు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.
మల్టీ నేషనల్ నేవల్ ఎక్సర్సైజస్-2024 (మిలాన్-2024)’కు విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశంతో స్నేహపూరితంగా ఉండే దేశాలను రెండేళ్లకు ఒకసారి ఆహ్వానించి ‘మిలాన్’ పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది 1995లో మొదలైంది. తొలి మిలాన్కు ఇండోనేషియా, సింగపూర్, థాయ్ల్యాండ్, శ్రీలంక దేశాలు మాత్రమే హాజరయ్యాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా రెండేళ్లకొకసారి దీనిని అండమాన్లో నిర్వహిస్తున్నారు. 2014లో అత్యధికంగా 17 దేశాలు పాల్గొన్నాయి. ఆ తరువాత మిలాన్ పట్ల అనేక దేశాలు ఆసక్తి చూపడం, అండమాన్లో అందుకు సరిపడా మౌలిక వసతులు లేకపోవడంతో విశాఖపట్నం వేదికగా 2020లో నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా కారణంగా దానిని వాయిదా వేసి, 2022లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ 2024లో నిర్వహిస్తున్నారు. పరస్పరం అవగాహన పెంచుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం, అంతర్గత శక్తులను బలోపేతం చేసుకోవాలనేది ఇందులో పాల్గొనే దేశాల ప్రధాన ఉద్దేశం. మిలాన్ను ఈ నెల 27వ తేదీ వరకూ రెండు దశల్లో నిర్వహిస్తారు.
మిలాన్ రెండు విభాగాలుగా సాగుతుంది. ఇందులో మొదటిది హార్బర్ ఫేజ్. ఇందులో అన్ని దేశాల నౌకా దళాలు కలసి ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ నిర్వహిస్తాయి. రెండో దశ (సీ ఫేజ్)లో వివిధ దేశాల నేవీ దళాలు సముద్రంలో, గగనతలంలో విన్యాసాలు ప్రదర్శిస్తాయి. సబ్మెరైన్లపై పోరాటం, ఆకాశంలో లక్ష్యాలను ఛేదించడం వంటివి ఉంటాయి.