YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

జూన్ 2 కొత్త నోటిఫికేషన్లు

జూన్ 2 కొత్త నోటిఫికేషన్లు
తెలంగాణలో పెద్దఎత్తున కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతున్నది. దాదాపు నాలుగు నుంచి ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసి సుమారు మూడువేల వరకు ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది. రెండువేల పోస్టులను ఇప్పటికే ఖరారుచేయగా, మరో వెయ్యి పోస్టులను నోటిఫికేషన్లలో చేర్చనున్నట్టు తెలిసింది. ఈ కొలువుల్లో ప్రధానంగా సాధారణ డిగ్రీ అర్హత కలిగినవే అధికంగా ఉన్నాయని సమాచారం. ఈ ప్రకటనల ద్వారా నింపే కొలువుల ప్రక్రియను కొనసాగిస్తూనే పెండింగ్ పోస్టుల భర్తీని పూర్తిచేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే నోటిఫికేషన్ల విడుదలకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇందులో గ్రూప్- 4 కొలువులు 1300-1500, వీఆర్వో -700, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్- 450, గ్రూప్-1లో 125 ఖాళీలు ఉండనున్నట్టు సమాచారం. ఆర్టీసీలో 70 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్టు తెలిసింది. ఇంకా పలుశాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లకు చేర్చనున్నారు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు ప్రత్యేక విద్యార్హత తప్ప మిగతావాటికి సాధారణ డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులు పోటీపడవచ్చు.గ్రూప్-4కు చెందిన మిగతా విభాగాల్లోని పోస్టులను ఇదే నోటిఫికేషన్లలో భర్తీచేయనున్నట్టు తెలిసింది. జూన్ 2న ప్రకటన విడుదల చేసి ప్రిలిమినరీ-మెయిన్స్, మౌఖిక పరీక్షలను వచ్చే మార్చినాటికి పూర్తిచేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్టు తెలిసింది. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతూనే, పెండింగ్ పోస్టుల భర్తీలో టీఎస్‌పీఎస్సీ వేగం పెంచుతున్నది. టీచర్ కొలువుల భర్తీలో భాగంగా టీఆర్టీ తుది కీపై సమస్యలను పరిష్కరించి సవరణ కీ విడుదల చేసింది. అన్ని జిల్లాలవారీగా 1:3 నిష్పత్తిలో జనరల్ ర్యాంకుల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో అభ్యర్థులు ర్యాంకులను, మార్కులను తెలుసుకునేందుకు వీలుండటంతో వివాదాలు తలెత్తవని భావిస్తున్నది. ఇప్పటికే పదిజిల్లాల డీఈవోలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ శిక్షణను పూర్తిచేసింది. ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయ్యేలోపు కొత్త టీచర్లు వచ్చే అవకాశం ఉండనున్నది. అటవీశాఖ కొలువుల్లో ఎఫ్‌ఆర్వోలో అభ్యర్థుల ఎంపిక, ఫిజికల్ టెస్ట్‌లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి ఆరోగ్యపరీక్షలు జరుగనున్నాయి. ఇవి పూర్తయ్యాక 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలువనున్నారు. తర్వాత ఎఫ్‌ఎస్వో నియామక ప్రక్రియను పూర్తిచేయనున్నారు.. వైద్యశాఖ పోస్టులైన డెంటల్ స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీ, అసిస్టెంట్ సివిల్‌సర్జన్,ట్యూటర్ పోస్టులకు త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. తర్వాత అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటి షెడ్యూల్‌ను ఈ వారంలో విడుదల చేయనున్నారు. తర్వాత 273 డిప్యూటీ సర్వేయర్ల ఎంపిక జాబితా విడుదల చేయనున్నారని సమాచారం. దీంతోపాటుగా 541 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన కోర్టు చిక్కులను పరిష్కరించి భర్తీ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. వచ్చే నెలలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేయనున్నట్టు సమాచారం. 

Related Posts