YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశంలో వైసీపీకి కోల్పొతున్న పట్టు

ప్రకాశంలో వైసీపీకి  కోల్పొతున్న పట్టు

ఒంగోలు, ఫిబ్రవరి 20 
ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ప‌ట్టు కోల్పోతోందా?  సంస్క‌ర‌ణ‌ల పేరిట చేప‌ట్టిన మార్పులు ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయా?  నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త‌, ఐక్య‌త కూడా లోపిస్తోందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రో రెండు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న తరుణంలో ప్ర‌కాశం జిల్లా వైసీపీలో జ‌రుగుతున్న మార్పులు.. నేత‌ల మ‌ధ్య విభేదాలు స్థానికంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. పదేపదే ప్రాంతీయ సమన్వయకర్తలు మారుతున్నా సమన్వయం చేయలేకపోతున్నారు. ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దర్శి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని వైఎస్సార్ సీపీ నేత‌ల మ‌ధ్య‌ అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. ఈ జిల్లాలో తొలుత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత ప్ర‌స్తుత టీటీడీ బోర్డు చైర్మ‌న్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యుడు బీదా మస్తాన్‌రావు, అనంతరం రాజ్య‌స‌భ స‌భ్యుడు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాకం విజయసాయిరెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తలుగా పనిచేశారు. అయినా పార్టీని ఏకతాటిపై నడపడంలో విఫలమయ్యారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు మ‌రో సంచ‌ల‌న మార్పు చోటు చేసుకుంది. చంద్ర‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ని ప్రాంతీయ సమన్వయకర్తగా నియ‌మించారు. దీంతో స‌మ‌స్య‌లు తీర‌క‌పోగా.. మ‌రింతగా పెరిగాయ‌నే వాద‌న వినిపిస్తోంది.  ఒక‌ప్పుడు చిన్న కార్య‌క్ర‌మ‌మైనా.. వైఎస్సార్ సీపీలో పెద్ద ఎత్తున ఉత్సాహం ఉండేది. నాయ‌కులు ఎక్క‌డెక్క‌డ నుంచో వ‌చ్చి పాల్గొనేవారు. కానీ, తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ సీఎం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. సింగరాయకొండలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్రాంతీయ సమన్వయకర్త హోదాలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. అయినా శ్రేణుల నుంచి పెద్దగా స్పందన క‌నిపించ‌లేదు. భారీగా కార్యకర్తలు హాజరవుతారని ఏర్పాట్లు చేసినా.. ఎక్క‌డా ఆ మేర‌కు రాలేదు. ఇక‌, ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ కొండపిలో మొదటి నుంచి వరికూటి అశోక్‌బాబు వ‌ర్గం మాదాసి వెంక‌య్య వ‌ర్గాల‌కు మ‌ధ్య వివాదం ఉంది. దీంతో వీరిద్ద‌రూ కూడా ఈ కార్య‌క్ర‌మానికి ముఖం చాటేశారు. యర్రగొండపాలెం కొత్త సమన్వయకర్తగా నియ‌మితులైన‌ తాటిపర్తి చంద్రశేఖర్‌ వర్గానికి కూడా ఆహ్వానం లేద‌ని స‌మాచారం. దీంతో వారు కూడా దూరంగానే ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు సామంతుల రవికుమార్‌రెడ్డి హాజరైనా శిలాఫలకంపై పేరు లేకపోవడంతో కినుక వహించి వేదిక పైకి వెళ్లలేదు.ఇటీవ‌ల ఎమ్మెల్యే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గానికి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప్ర‌స్తుత మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ను నియ‌మించారు. అయితే.. ఆయ‌న ఇక్క‌డ‌కు వచ్చి రెండు నెలలు దాటిపోయింది. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయినప్పటికీ వర్గ విభేదాలు చక్కదిద్దడంలో విఫలమవుతున్నారు. రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు మాత్రమే ఆయన వెన్నంటి నడుస్తున్నారు. మిగిలిన వర్గాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సహకరించ‌డం లేదు. వైఎస్సార్ సీపీ అధిష్టానం వైఖ‌రిపై ఇటీవ‌ల కాలంలో విముఖ‌త వ్య‌క్తం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి లోలోన ర‌గిలిపోతున్నారు.  ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంట శ్రీనివాసులురెడ్డికే కేటాయించాలంటూ ఆయ‌న ప‌ట్టిన ప‌ట్టును పార్టీ అధిష్ఠానం ప‌ట్టించుకోలేదు. అంతేకాదు.. ఆ వెంట‌నే ఈ స్థానానికి తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రంగంలోకి దించింది. ఎంపీ మాగుంట కోసం పట్టుబట్టిన బాలినేని.. ఒంగోలు ఇళ్లపట్టాలకు నిధుల కేటాయింపు, సీఎంతో సంప్రదింపుల అనంతరం మెత్తబడ్డారు. నూతన సమన్వయకర్త చెవిరెడ్డితో సర్దుకుపోయారు. ఈ పరిణామాల తర్వాత ఇటు మాగుంట, అటు బాలినేని ఇద్దరూ ఏ వేదిక పైనా ఇంతవరకు తారసపడలేదు. మ‌రోవైపు.. నూత‌న స‌మ‌న్వ‌య క‌ర్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌ని భావిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు మాత్రం ఆయ‌న‌కు క‌లిసి రావ‌డం లేదేని అంటున్నారు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో గ‌త 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాల్లో(చీరాల‌-ప‌ర్చూరు-అద్దంకి-కొండ‌పి) విజ‌యం ద‌క్కించుకుంది. వీరిలో ఒకరు పార్టీ ఫిరాయించి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా మారారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆ సీట్లు కూడా తాము ద‌క్కించుకోవాల‌ని వైఎస్సార్ సీపీ భావిస్తున్నా.. ఆ మేర‌కు క్షేత్ర‌స్థాయిలో అయితే ప‌రిస్థితి క‌లిసి రావ‌డం లేద‌ని పార్టీ సీనియ‌ర్లు న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.    

Related Posts