కడప, ఫిబ్రవరి 23
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ 2004లో చివరి సారి గెలిచింది. మళ్లీ ఇప్పటి వరకూ గెలవలేదు. గత నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున, వైసీపీ తరపున పోటీ చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి గెలుపు అవకాశాలు ఉన్నాయనుకున్నారేమో కానీ.. టీడీపీ నేతలు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మక రాజకీయాలు చేస్తూ తామే పోటీ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో క్యాడర్ లోనూ గందరగోళం ఏర్పడుతోంది. రాయచోటి తెలుగు దేశం పార్టీ టికెట్ వేటలో టికెట్ వేటలో మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, గడికోట ద్వారకనాధరెడ్డి, ఆర్,రమేష్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్ బాబు ఉన్నారు. చంద్రబాబునాయుడు టికెట్ పట్ల స్పష్టత ఇవ్వకపోవడం గందర గోళానికి దారితీస్తోంది. ఇప్పటివరకు అసెంబ్లీ ఇన్‌ఛార్జి ఆర్.రమేష్‌రెడ్డి తనకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలకు దగ్గరయ్యేందుక ఆయన కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనే పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇతర నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో రమేష్ రెడ్డి కొత్తగా కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఇటీవల మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనా ధరెడ్డి టీడీపీలో చేరారు. ఆయన విజయసాయిరెడ్డికి బావమరిది. ఆయన కూడా టిక్కెట్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అనుచరులు, కార్యకర్తలను సమీ కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు టీడీపీ టికెట్ తనకు ఇచ్చారనే పేరుతో రాంప్రసాద్‌రెడ్డి సామాజిక మాద్యమాల్లో లీకులివ్వడం, అనుచరులతో బాణాసంచా కాల్చడం వంటివి చేశారు. అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న రమేష్‌రెడ్డి తనను నిర్లక్ష్యం చేయడంపై కినుక వహించి నట్లు సమాచారం. వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వ హించిన అనంతరం పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ మారుతారని వస్తున్న వార్తల పట్ల మాట్లాడుతూ తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, అటువంటి పరిస్థితి ఎదురైతే ఆలో చిస్తానని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు టికెట్ నిరాకరణకు సోదరుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కడప ఎంపీగా పోటీ చేయనున్నారు. ఈయన సతీమణి మాధవికి కూడా కడప అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి ఎన్ని టిక్కెట్ ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లాలో ఆ కుటుంబానికి ప్రాధాన్యమిస్తే రమేష్ రెడ్డికి అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పలుసార్లు ప్రాతినిధ్యం వహించిన సుగువాసి పాలకొండరాయుడు తనయుడు ప్రసాద్ బాబు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రాయచోటి సీటు అడుగుతున్నారు. ఆయన ఇప్పటికే లోకేష్ బాబును, ఇటీవల పులివెందులలో పార్టీ అధినేత చంద్రబాబును కలసి టిక్కెట్ తనకే కేటాయించాలని కోరినట్లు సమాచారం.