ఏలూరు, ఫిబ్రవరి 23
తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీుకున్నారు. అదే సభా వేదికపై ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు సీట్ల సర్దుబాటు ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశంపై చర్చించారు. తాడేపల్లిగూడెం సభలో కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్టు సమాచారం. ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించారు. తెదేపా సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని హాజరయ్యారు. వలంటీర్ల వ్యవస్థ కట్టడిపై టీడీపీ - జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలను టీడీపీ - జనసేన సీరియస్‌గా తీసుకుంది. వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఈసీ ఆదేశాలు ఉన్నాయమని కూటమి చెబుతోంది. మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. సమన్వయ కమిటీ భేటీలో సీట్ల అంశం చర్చకు రాలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీట్ల అంశాన్ని స్వయంగా డీల్ చేస్తున్నారు. బీజేపీతో చర్చలు.. పొత్తుల అంశం కొలిక్కి వచ్చిన తర్వాత వారు ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ఈ చర్చలన్నీ తాడేపల్లిగూడెం సభలోపే పూర్తవుతాయని.. ఆ సభలోనే ప్రకటన ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.గెలవలేనని తెలిసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతలు మీడియాపై దాడులు చేస్తున్నారు. మీడియా దాడులను ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ఐదేళ్ల పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేశారు. దేశవ్యాప్తంగా మన రాష్ట్ర పరువు తీశారు. ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకోలేకుండా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చించుకున్నామని.. ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదని పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. రెండు పార్టీలు కలిసి పనిచేసుకునే సమయం వచ్చిందన్నారు. అన్ని స్థాయిల్లో కలిసి పనిచేయాలని కార్యకర్తలను కోరుతున్నామని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.