ఎర్ర చందనం స్మగ్లింగ్ ను అరికట్టడానికి అవరోధాలు అనేకం. అటవీశాఖలో సిబ్బందితో పాటు ఆయుధాల కొరత కూడా తీవ్ర సమస్యగా ఉందని అధికారులు చెబుతున్నారు. తిరుమల అటవీ ప్రాంతంలో ఇద్దరు అటవీశాఖ అధికారులు స్మగ్లర్లు చేతిలో హతమయ్యారు. ఈ సంఘటనతో ఎర్రకూలీలను అడ్డు కోవాలంటే వారికి దీటుగా అత్యాధునిక ఆయుధాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో అమెరికా నుంచి 200 అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అయితే అవి ఢిల్లీ విమానాశ్రయంలో తుప్పు పడుతున్నాయి. ఎర్రచందనం అమ్ముకుని వేల కోట్లు రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకుంది గానీ, కస్టమ్స్ డ్యూటీకి రూ.29 లక్షలు చెల్లించక పోవడంతో అక్కడే ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ తీసుకోక పోవడంతో ప్రభుత్వం తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అటవీ శాఖలో అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కూడా ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లోని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుపతి వన్యప్రాణి విభాగం డీఎఫ్‌ఓ పరిధిలో చామల, బాలపల్లె అటవీ రేంజ్‌లు ఉన్నాయి. చిత్తూరు జిల్లా చామల, వైఎస్‌ఆర్ జిల్లా బాలపల్లె రేంజ్‌లో 28 బీట్లు ఉన్నాయి. ఇందులో ఎర్రచందనం లేని బీట్లు 10 ఉన్నాయి. 18 బీట్లులో ఎర్రచందనం పెద్ద ఎత్తున ఉంది. ఈ ప్రాంతాల్లోకే అత్యధికంగా ఎర్రదండు వెళుతున్నారు. వీటి పరిధిలో 50 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఎవ్వరూ ఈ ప్రాంతంలో పని చేయడానికి ముందుకు రావడంలేదు. దీంతో ఇక్కడ పని చేయడానికి 90 మంది ప్రొటెక్షన్ వాచర్లను తీసుకున్నారు. వీరంతా స్థానికంగానే ఉండేవారు. అయితే వీరి ఎంపికలో అధికారులు అవలంభిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు ఉంన్నాయి. ఇందులో ఎక్కువ మంది స్థానికంగా ఉన్న ఎర్ర స్మగ్లర్లు, నాయకులు పెట్టినవారే ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ వీరి ఎంపికపై అనేక అనుమానాలు లేక పోలేదు.ఎర్రచందనం అక్రమ రవాణాలో అటవీ శాఖకు సంబంధించి ఎవ్వరిపైనైనా సరే పోలీసులకు పట్టుబడ్డ తరువాతనే అటవీశాఖ చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. చామల రేంజ్ పరిధిలో మచ్చుకు కొన్ని.. గతేడాది ఫిబ్రవరి నెలలో చామలరేంజ్ పరిధిలోని ఎర్రావారిపాళెం మండలం నెరబైలు సెక్షన్‌లో ఆరుగురు ప్రొటెక్షన్ వాచర్లు పట్టుబడ్డారు. వీరి నుంచి వాహనాలను, దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో ఎఫ్‌బీఓ చొక్కలింగంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. అదే ఏడాది భాకరాపేట అటవీ కార్యాలయంలోని గోదాము నుంచి దుంగలు గోడపై నుంచి దాటవేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అలాగే మదనపల్లెకు చెందిన ఓ స్మగ్లర్‌ను ప్రొటెక్షన్ వాచర్‌గా పెట్టుకుని అభాసుపాలవ్వడం అందరికి తెలిసిందే.. పోలీసులకు పట్టుబడ్డ తరువాతనే చర్యలు తీసుకోవడంపై అటవీశా ఖ ఉన్నతాధికారులకు అనుమానాలు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.ప్రొటెక్షన్ వాచర్లుగా పనిచేసినవారే ప్రస్తుతం హైజాకింగ్ ముఠాగా అవతారమెత్తి స్థానిక యువతను వారితో కలుపుకుని నాటు తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతూ ఎర్రచందనం తరలిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తమిళ స్మగ్లర్లు నుంచి వచ్చిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి వారి కోసం ప్రత్యేక నిఘా పెట్టింది. అయితే ఆదివారం రాత్రి కళ్యాణిడ్యాం సమీపంలోని పులిబోను వద్ద ఐదుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి స్విఫ్ట్ కారు, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రంగంపేటకు చెందిన ప్రముఖ స్మగ్లర్ సురేష్ ఆధ్వర్యంలోనే ఈ తతంగం నడుస్తుందని తెలుసుకుని మరికొంత మందికోసం గాలింపులు చేపట్టినట్లు సమాచారం.