హైదరాబాద్, ఫిబ్రవరి 23
ధరణి కమిటీ ఈ నెల 24న కలెక్టర్లతో సమావేశం నిర్వహించనుంది. ఇందు కోసం ఆరు ప్రధాన అజెండాలు సిద్ధం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ధరణి సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ మరో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 24న ఉదయం పది గంటలకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులు, పెండింగ్‌కు గల కారణాలు, వాటి పరిష్కారానికి చర్యల గురించి చర్చిస్తారు. నిషేధిత ఆస్తులకు సంబంధించిన సమస్యలు, సెక్షన్ 22 A జాబితాపై చర్చిస్తారు. జాబితాను సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. తాత్కాలిక ల్యాండ్ ట్రిబ్యునల్స్ ద్వారా పరిష్కరించబడిన కేసులు – అనుభవాలు, ముందుకు వెళ్లే మార్గాలను సమావేశంలో చర్చిస్తారు. సాదాబైనామా దరఖాస్తుల స్థితిని పరిశీలిస్తారు. RSR/Setwar మిస్ మ్యాచ్‌కు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేస్తారు.ROR చట్టం, వివిధ స్థాయిలలోని రెవెన్యూ అధికారుల పనితీరు, వివిధ అధికారుల మధ్య ముఖ్యంగా తహశీల్దార్, RDO, JC అధికారాల పంపిణీలో మార్పుల గురించి చర్చిస్తారు. భూమి రిజిస్ట్రేషన్లలో సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తారు. ఇనామ్, జాగీర్ సహా ఇతర చట్టాల కింద భూ వివాదాలు, సమస్యలు, కేసులు, పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించే మార్గాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చిస్తారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూ సమస్యలపై ఫోకస్ చేస్తారు. రెవెన్యూ- అటవీ వివాదాలపై చర్చిస్తారు. ఎండోమెంట్, వక్ఫ్ భూముల సమస్యలపై దృష్టి సారిస్తారు. మెరుగైన భూపరిపాలన కోసం రెవెన్యూ పరిపాలనలో మార్పులపై కూడా కలెక్టర్లతో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో భూ సమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్‌వేర్‌ను మార్చితే సరిపోదని, చట్టాలను కూడా మార్చాల్సి ఉంటుందని ధరణిపై నియమించిన కమిటీ గతంలో అభిప్రాయపడింది. ధరణి సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి మాడ్యూల్స్ ఎలా పనిచేస్తున్నాయో కమిటీ తెలుసుకుంది. దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు ఏయే దశల్లో సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తోందో కమిటీ గత సమావేశాల్లో తెలుసుకుంది. బాధ్యతలన్నీ కలెక్టర్లకు అప్పగించడం వల్ల వస్తున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో కలుగుతున్న ఇబ్బందులు, చట్టపరంగా చేయాల్సిన మార్పులపై కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం.