YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ ఓటు... ఎవరి పాటు

గులాబీ ఓటు... ఎవరి పాటు

హైదరాబాద్, ఫిబ్రవరి 24
పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాయత్తం అవుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీకలంటే ముందే బీజేపీ ప్రచారం కూడా ప్రారంభించింది. నేడు రేపో పది స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా దూకుడు పెంచింది. మహబూబ్‌నగర్‌ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవాలని చూస్తోంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు ఎంపీలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌నేత కాంగ్రెస్‌లో చేరాడు. మరో ఇద్దరు ముగ్గురు కూడా పార్టీ మారతారని తెలుస్తోంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు బీఆర్‌ఎస్‌కు కత్తిమీద సాములా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణం. కేసీఆర్‌ అహంకార పూరిత వైఖరి, కుటుంబ పాలన గులాబీ ఓటమిలో కీలకపాత్ర పోషించాయి. ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు కూడా పడిపోతోంది. కంచుకోట అనుకున్న నియోజకవర్గాల్లోనే గులాబీ పార్టీ నేతలు పార్టీలు మారుతున్నారు. ఇక ఆ పార్టీ నేతలు నిర్వహించిన సర్వేలో లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 2 నుంచి 3 స్థానాలు మాత్రమే గెలుస్తుందని తేలడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. ఇక బీఆర్‌ఎకు కంచుకోట కరీంనగర్‌. ఇక్కడి నుంచే 2014, 2018లో 12 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. 2023 ఎన్నికల్లో మాత్రం జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల, కరీంనగర్, హుజూరాబాద్‌లో విజయం సాధించింది. కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజవర్గాల విషయానికి వస్తే కరీంనగర్, హుజూరాబాద్‌ సిరిసిల్లలో పార్టీ విజయం సాధించింది. మరో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలిచింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో విజయం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. మరోవైపు సిట్టింగ్‌ ఎంపీగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఉన్నారు. ఆయన ఇప్పటికే పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల వరకు యాత్ర సాగేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. మరోవైపు అయోధ్య రాముడిని చిత్రపటాలు ప్రతీ ఇంటికి పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు ఈసారి కాంగ్రెస్, బీజేపీ పంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు కూడా ఎక్కువే, కరీంనగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వీరే గెలుపు ఓటములను నిర్ణయిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ వారి ఓట్లతోనే గంగుల కమలాకర్‌ స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ మైనారిటీ ఓట్లు ఈసారి కాంగ్రెస్‌కు పోల్‌ అవుతాయని తెలుస్తోంది. దాదాపు 60 వేల మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్‌ పరిధిలో లక్ష వరకు మైనారిటీ ఓట్లు ఉంటాయిన అంచనా. ఇక బీఆర్‌ఎస్‌ హిందూ ఓట్లు.. ఈసారి పూర్తిగా బీజేపీకి పోలవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థి వినోద్‌పై వ్యతిరేకత లేకపోయినా.. హిందూ ఇజంపై ఆ పార్టీ నేతల వైఖరి, కేసీఆర్‌ అహంకారం, కేసీఆర్‌ అతివిశ్వాసం కారణంగా హిందు ఓటర్లు కూడా బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడానికి వెనుకాడుతున్నారని తెలుస్తోంది.

Related Posts