కాకినాడ, ఫిబ్రవరి 26,
ఏపీలో టీడీపీ, జనసేన కూటమి పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. టీడీపీ నుంచి మొత్తం 94 మంది అభ్యర్థులు ప్రకటించారు చంద్రబాబు.. జనసేన 24 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు. మూడు పార్లమెంట్ స్థానాల్లోనూ జనసేన పోటీ చేయబోతోంది. అయితే 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి – నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల – లోకం మాధవి, అనకాపల్లి – కొణతాల రామకృష్ణ, రాజానగరం – బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ – పంతం నానాజీ పోటీచేయనున్నట్లు తెలిపారు. మిగతా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తారు. గతంలో పది స్థానాలు సాధించి ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశం ఉండేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోటీ చేస్తున్న స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని అన్నారు. పార్లమెంట్ సీట్లతో కలుపుకుంటే మొత్తం 40 సీట్లలో పోటీ చేస్తున్నట్టే అని తెలిపారు. పొత్తుల్లో భాగంగా త్యాగాలు చేసిన నేతలకు అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తింపు ఇస్తామని అన్నారు.అయితే, టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనకు ముందు అనకాపల్లి సీటుపై జనసేన వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ముందుగా అనకాపల్లి నుంచి ఎంపీ సీటుకు తానే పోటీ చేస్తానని కొణతాల రామకృష్ణ భావించారు. ఈ క్రమంలోనే అనకాపల్లి బరిలో తానున్నానని నాగబాబు సిగ్నల్స్ ఇచ్చారు. ఆయన నిర్వహించిన సమావేశాల్లో కొణతాల పాల్గోనలేదు. గతంలోనూ ఎంపీగా పోటీ చేయడంతో.. ఈసారి కూడా కొణతాల ఎంపీ సీటుకే పోటీ చేస్తారని భావించారు. కానీ అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే సీటుకు ఆయన పేరును ప్రకటించారు పవన్ కల్యాణ్..కారణం.. అనకాపల్లి సీటు విషయంలో పవన్ కల్యాణ్ ఎంటర్ అవ్వడం.. కొద్దిరోజుల కిందట పవన్ కల్యాణ్ కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లి చాలా సేపు ఆయనతో చర్చించారు. వారి మధ్య జరిగిన చర్చ ఏమిటో ఇంకా బయటకు రాలేదు. మొత్తానికి పవన్ కల్యాణ్ దౌత్యం ఫలించడంతో కొణతాలకు అనకాపల్లి సీటు కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఈ జాబితాలో నాగబాబు పేరును ఇంకా ప్రకటించలేదు.