విజయవాడ, ఫిబ్రవరి 26,
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆ కుటుంబం అంటేనే ప్రత్యేక గుర్తింపు ఉండేది. అదో వసుదైక కుటుంబంగా నిలిచింది. వైఎస్ రాజారెడ్డి హయాంలో నేపథ్యం అంతంత మాత్రమే. రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రవేశం చేసిన తర్వాతే ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కడప జిల్లా రాజకీయాలను శాసించింది. ఉమ్మడి రాష్ట్ర నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి ఎదగడానికి కూడా కుటుంబం దోహద పడింది. అటువంటి కుటుంబం ఇప్పుడు విడిపోయింది. చెట్టుకొకరు, పుట్టకొకరుగా మిగిలిపోయారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జగన్.. కుటుంబాన్ని ఏకతాటిపైకి నిలపలేకపోవడం నిజంగా వైఫల్యమే. గత ఎన్నికల్లో ఆయన వెంట నడిచిన కుటుంబం, నాయకులు, చివరకు కార్యకర్తలు సైతం ఇప్పుడు లేకపోవడం ఆయనకు లోటే.వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నాయకుడు వైసీపీని వీడిన తర్వాత ఒక బలమైన చర్చ నడుస్తోంది. వైసీపీకి ఆయన ఒక మూల స్తంభం. కరుడుగట్టిన జగన్ అభిమాని. అటువంటి నేత విసిగి వేసారి పార్టీని వీడారు. దీంతో సొంత పార్టీలోనే బలమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల సైతం దూరంగా ఉన్నారు. మేనల్లుడి వివాహానికి హాజరు కాలేనంత గ్యాప్ ఏర్పడింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు జగన్ దూరంగా ఉన్నారు. ఆయన భార్య భారతి సైతం అటువైపు వెళ్ళలేదు. అయితే వివాహ వేడుకలు మాత్రం ఘనంగా జరిగాయి. వైఎస్సార్ బొమ్మను ముందు పెట్టుకొని ఆనందోత్సాహాలతో ఆయన మనువడి వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో వైయస్ విజయమ్మ సైతం హ్యాపీగా కనిపించారు. కుటుంబమంతా ఒకే వేదిక పైకి వచ్చినా .. కుటుంబ పెద్దగా ఉన్న జగన్ మాత్రం కాన రాలేదు.తెలుగు నాట ఎన్నో రాజకీయ కుటుంబాలు చూసాం. ఆ కుటుంబ సభ్యుల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నా.., సుఖదుఃఖాల్లో వారు పాలుపంచుకోవడం చూశాం. కానీ ఇప్పుడు షర్మిల కుమారుడి వివాహానికి మేనమామ హోదాలో వెళ్లాల్సిన జగన్ ముఖం చాటేశారు. కుటుంబాల్లో అరమరికలు రావడం సహజం. కానీ శుభకార్యాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ మహానేత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జగన్.. ఏ కుటుంబ అండదండలతో అందలమెక్కారో.. అదే కుటుంబాన్ని పట్టించుకోకపోవడం విమర్శలకు కారణమవుతోంది.ప్రస్తుతం ఆ నలుగురే జగన్ కుటుంబంగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నలుగురే జగన్ కుటుంబంగా ముందుకు సాగుతున్నారు. అయితే వీరెవరు చివరి వరకు అండగా ఉంటారా? అంటే అది డౌటే. వారికి రాజకీయపరంగా వచ్చే ఆదాయం ఉన్నంతకాలం ఉంటారు.. తరువాత ఎవరి మానాన వారు తప్పుకోవడం ఖాయం. గత ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యేందుకు వైసీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంతలా పని చేస్తున్నారా? అంటే మాత్రం లేదనే సమాధానం వినిపిస్తోంది. అయినవారిని వదులుకొని జగన్ చేస్తున్నది తప్పా? ఒప్పా? అన్నది ఎన్నికల ఫలితాలు బట్టి తెలియనుంది. అంతవరకు విశ్లేషించడం తప్ప మరేం చేయలేం.