YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిర్లిప్తంగా గులాబీ శ్రేణులు...

నిర్లిప్తంగా గులాబీ శ్రేణులు...

హైదరాబాద్, ఫిబ్రవరి 26
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ మార్చి పదో తేదీలోపు రానుంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొదటి విడతలోనే జరుగుతుంది. అయినా భారత  రాష్ట్ర సమితి లో నిర్లిప్తత కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక..  ఎన్నికల వ్యూహంపై  అసలు ఎలాంటి కసరత్తు చేయడం లేదు. కీలకమైన సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం కాగా కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. నల్లగొండలో నిర్వహించిన కృష్ణా జలాల హక్కుల సాధన, కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై జరిగిన బహిరంగ సభ తర్వాత వరుస కార్యక్రమాలు పెడతారని అనుకున్నారు. కానీ మళ్లీ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయలేదు. హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ అని..  కేటీఆర్, హరీష్ పాదయాత్ర అని  పార్టీ వర్గాల నుంచి లీకులు  వస్తున్నాయి కానీ.. ఎన్నికల షెడ్యూల్ వస్తే ఇలాంటి వాటికి అవకాశం ఉండదు. కేసీఆర్ ఇప్పటి వరకూ వ్యక్తిగతంగా పార్లమెంట్ ఎన్నికల కోసం కసరత్తు చేశారేమో కానీ.. ప్రత్యేకంగా పార్టీ నేతలతో ఎలాంటి సమీక్షలు చేయలేదు. మూడు నాలుగు పార్లమెంటు సెగ్మెంట్లపై సమీక్షా సమావేశాలు, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆరెస్ ఎంపీలకు మార్గనిర్దేశం చేయడం మినహా అంత సీరియస్‌గా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.  కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆశావహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, వాటిని పరిశీలించి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది.   ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రజలకు పరిచయం చేశారు. పార్లమెంటు స్థానాలవారీగా కాంగ్రెస్ నాయకత్వం మంత్రులకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 స్థానాలకుగాను కనీసం 14 స్థానాలను దక్కించుకోవాలని పార్టీ నాయకత్వం hdవ్యూహరచన చేస్తున్నదని సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మంత్రులు సమీక్షలు నిర్వహించి, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు.   అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న విజయం కాకపోయినా ఎనిమిది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్న బీజేపీ   లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నది. ఆ మేరకు రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేసింది. విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయ సంకల్ప యాత్రల ద్వారా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆరెస్‌తోపాటు కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం బీఆరెస్ తన శక్తియుక్తులను ప్రయోగిస్తున్నదన్న ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ వైపు నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు.   ఈ పొత్తుల అంశం ప్రచారంలోకి రాగానే ఎంపీ బండి సంజయ్ ఆగ్రహంతో ఊగిపోయారు. రెండు రోజుల క్రితం జరిగిన విజయ సంకల్పయాత్రలో సంజయ్ మాట్లాడుతూ, బీఆరెస్‌తో పొత్తు ఉండదని, పొత్తు ఉంటుందని ఎవరైనా అంటే చెప్పులతో కొట్టండని చెప్పారు. అక్కడితో ఆగకుండా.. సభలో పాల్గొన్న కార్తకర్తలు, ప్రజలు చెప్పులు ఎత్తి చూపించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పొత్తుల ప్రచారం జరగడం వల్ల   బీజేపీ, బీఆరెస్‌ ఒక్కటేననే బలమైన ప్రచారం జరుగుతోందని దాని వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని బండి సంజయ్ భావిస్తున్నారు. దాని నుంచి నుంచి బయటపడటానికి ఇప్పుడు కాషాయ రాష్ట్ర నాయకులు  ప్రయత్నిస్తూంటే తాజాగా పొత్తుల అంశం ప్రచారంలోకి వచ్చింది. అయితే  కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ నోటీసులు ఇవ్వడంతో బీజేపీకి మరింత బలం చేకూరుతోంది. ఒక వేళ  కవిత అరెస్ట్ అయితే పొత్తులు అనే మాట ఉండకపోవచ్చని అంటున్నారు.  బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులపైనా  స్పష్టత లేదు.  చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి పోటీలో ఉంటారని కేటీఆర్ ప్రకటించారు. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించగా, ఆ పార్టీ పెద్దలు నిరాకరించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా నేరుగానేచెప్పారు. అయినా బీఆరెస్ కూడా రంజిత్ రెడ్డి మినహా మరొకరిని ప్రకటించడం లేదు. మిగతా స్థానాల్లో పోటీ చేసేందుకు ఒకరిద్దరు మినహా ఎవరూ ముందుకు రావడం లేదు. పార్టీ నాయకత్వం ఫండ్ ఇస్తే తప్ప పోటీ చేయలేమని నిరాసక్తతను వ్యక్తం చేస్తున్నారు.  ఖర్చు చేసినా గెలుస్తామన్న ధీమా కూడా లేకపోవడం ఒక కారణంగా చెబుతున్నారు. అసెంబ్లీ  ఎన్నికల్లో ఓడిపోవడం.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేస్తూ  ప్రజల్లోకి వెళ్తూండటంతో.. అంత త్వరగా ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్లుతారని అనుకోవడం లేదు. అందుకే పార్టీ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టకపోతే.. ముందే రేసు నుంచి వైదొలిగినట్లు అవుతుంది పరిస్థితి. ప్రస్తుతం  బీఆర్ఎస్‌కు సానుకూల వాతావరణం కనిపించడం లేదు. పోటీ చేసి ఒకటి, రెండు స్థానాలకు పరిమితమైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే.. తాత్కలికంగా అయినా  చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నారు. కానీ ఢిల్లీ నేతలు ఏ అభిప్రాయం వ్యక్తం చేయకపోయినా  కే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఇద్దరు ముగ్గురు మినహా అందరూ బీఆరెస్ అంటేనే భగ్గుమంటున్నారు. దీంతో పొత్తులపై అడుగు ముందుకు పడటం లేదు. చాణక్యుడి లాంటి కేసీఆర్ రాజకీయంగా నిస్సహాయంగా ఉండిపోయారన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

Related Posts