ఏలూరు, ఫిబ్రవరి 27
టిడిపి, జనసేన సంయుక్తంగా అభ్యర్థులను ప్రకటించాయి. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టిడిపి అంగీకరించింది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం 94 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. జనసేన మాత్రం ఐదింటికి పరిమితమైంది. టిడిపి,జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిందని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. అటువంటిప్పుడు జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవచ్చు కదా? అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన సీట్లు తక్కువ కదా.. ఈ ట్విస్టులు ఏమిటని వాపోతున్నారు.అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనలో కూడా అసంతృప్తి నెలకొంది. చాలామంది బాహటంగానే తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. ముఖ్యంగా జనసేనలో విపరీతమైన అసంతృప్తి ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన నేతలు ఉన్నారు. పొత్తులో భాగంగా సీట్లు దక్కితే.. ఎమ్మెల్యేలుగా గెలుపొందుతామని ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 40 వరకు అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని ఆశించారు. కానీ వారి ఆశలు నీరుగారిపోయాయి. కేవలం 24 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇది జనసైనికులకు మింగుడు పడని అంశం. కానీ పవన్ మాత్రం బలం తగ్గట్టే సీట్లు కోరామని.. సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని సీట్లు అడిగామన్నది కాదని.. వచ్చిన సీట్లలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడమే తమ ముందున్న ధ్యేయమని జనసైనికులకు నూరి పోస్తున్నారు.మరోవైపు 24 సీట్లకు గాను ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించడంపై జనసైనికులు అనుమానపు చూపులు చూస్తున్నారు. ఈ ఐదు సీట్లలో కొణతాల రామకృష్ణకు సీటు కేటాయించడంపై అభ్యంతరాలు ఉన్నాయి. కొద్ది రోజుల కిందటే ఆయన జనసేనలో చేరారు. ఇలా చేరిన కొద్ది రోజులకే టికెట్ దక్కించుకున్నారు. వాస్తవానికి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన అనూహ్యంగా జనసేనలో చేరారు. టికెట్ సొంతం చేసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపిలోకి రావాల్సిన వారిని జనసేనలో చేర్చి టిక్కెట్ ఇప్పిస్తున్నారని టాక్ నడుస్తోంది. అందుకే ఆ 19 స్థానాలను రిజర్వులో పెట్టారని.. టిడిపిలో టిక్కెట్ దక్కని వారికి జనసేనలోకి పంపించి ఆ టిక్కెట్లు కేటాయిస్తారని పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జనసేన ఆవిర్భావం నుంచి ఎంతోమంది నాయకులు పనిచేశారు. అటువంటి నాయకులు టికెట్లు ఆశిస్తున్నారు. కానీ తాజా పరిస్థితులను చూసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీట్లు దక్కని జనసేన నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మిగతా 19 స్థానాల విషయంలో సొంత పార్టీ శ్రేణులకు న్యాయం జరగకుంటే.. జనసేనలో పొత్తును వ్యతిరేకించేవారు అధికమవుతారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.