YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ పథకాలు బాగున్నాయ్... కానీ

జగన్ పథకాలు బాగున్నాయ్... కానీ

అనంతపురం, ఫిబ్రవరి 27
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, టీడీపీ, జనసేన కూటమి మధ్య సీట్ల పంపకాలు, జగన్ పాలనపై మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంకా ఎలక్షన్ వేడి లేదని, తనకు రాజకీయాలు వాసన పోలేదని స్పష్టం చేశారు. ఎలాగైనా జగన్ ను గద్దె దించాలని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆత్మీయులకు కూడా టిక్కెట్ ఇవ్వలేదన్న జెసి.. రాక్షస పాలన అంతమొందించాల్సిన అవసరం ఉందన్నారు. టికెట్ రాని వాళ్ళకు అసంతృప్తి సహజమన్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని, అయినా మార్పు తప్పలేదన్నారు. పార్టీ అంతా ఏకతాటిపై ఉందని, నిన్న ఉన్నంత అసంతృప్తి, టెన్షన్ ప్రస్తుతం లేదని, రేపు అస్సలు ఉండదన్నారు. ఈ అసంతృప్తి అంతా పాలు పొంగు లాంటిదని, దీని గురించి ఆందోళన అవసరం లేదన్నారు. తనలాంటి వాళ్ళకు కూడా జగన్ అధికారంలోకి రాకూడదని ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఓట్లు చీలకుండా ఉండేందుకు బీజేపీతో పొత్తు కావాలనే కోరుకుంటున్నామని, ఎంత వరకు సఫలం అవుతుందో చూడాలన్నారు. చంద్రబాబు కచ్చితంగా సీఎం అవుతారని, అన్ని పార్టీల ధ్యేయం జగన్ అధికారంలోకి రాకూడదనే అని స్పష్టం చేశారు జెసి దివాకర్ రెడ్డి. తన కుమారుడు పవన్ రెడ్డికి టికెట్ ఎక్కడ అన్న విషయం తెలియదని, పార్టీ అధిష్టానాన్ని సోదరుడు, కుమారుడు పవన్ రెడ్డి కలిసిన మాట వాస్తవమేనన్నారు. కుటుంబానికి ఒక టిక్కెట్ అని చంద్రబాబు తమకు చెప్పలేదని వెల్లడించిన జెసి.. షర్మిల తెలంగాణకు కాకుండా ముందే ఏపీకి వేస్తే లాభం ఉండేదన్నారు. షర్మిల ట్రైన్ మిస్ అయిందని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ సభలకు వస్తున్న జనాలపైనా జెసి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మందు, ముక్క కోసమే జగన్ సభలకు జనాలు వస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో  టీడీపీ 12 స్థానాలు గెలుస్తోందని స్పష్టం చేశారు. జగన్ సభలకు జనం ఇతర జిల్లాల నుంచి వస్తున్నారని, ఇందుకు భారీ ఏర్పాట్లను స్థానిక నాయకులు చేసేలా ఆదేశాలు ఉన్నాయన్నారు. జగన్ పథకాలు కొన్ని బాగున్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలు కొనసాగిస్తూ.. కొత్త పథకాలు పెట్టబోతున్నామని జెసి స్పష్టం చేశారు. జగన్ పాలన మాత్రం బాలేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని జెసి దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. హిట్లర్ లాంటి నియంత పాలన రాష్ట్రంలో ఉందని, అందుకే షర్మిల బయటకు వచ్చారని వెల్లడించారు. టీడీపీ అభ్యర్ధుల లిస్ట్ చూసిన తరువాత అధికారపక్షం కూడా బయపడుతోందన్నారు. జగన్ కు బలం ఉందని, అయితే ప్రజలు మాత్రం ఆలోచనాపరులు అని జెసి పేర్కొన్నారు.

Related Posts