విశాఖపట్టణం, ఫిబ్రవరి 27
విశాఖపట్నం జిల్లాలో 15 నియోజక వర్గాలు ఉంటే ఆరు స్థానాలకు టీడీపీ , జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. 94 స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ఖరారు చేసి...ప్రత్యర్థులకు షాకిచ్చారు. సీటు దక్కని నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్ధిత్వాలు ఊహించినట్టుగానే ఖరారయ్యాయి. హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు కి మరోసారి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. సిట్టింగ్ ల జాబితాలో ఆయన పేరును ప్రక టించింది హైకమాండ్. 2009లో తొలిసారి గెలిచిన వెలగపూడి....ఇప్పుడు నాలుగోసారి బరిలోకి దిగుతున్నారు. ఆయనను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణను పోటీ పెట్టింది. దీంతో తూర్పులో రాజకీయం ఇప్పటికే వేడెక్కింది. ఇక్కడ జనసేన ఓటింగ్ బలమైనది...గెలుపు ఓటములను నిర్ధేశించే స్ధాయికి పెరిగింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున వెలగపూడి రామక్రిష్ణబాబు గెలుపొందారు.విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యే గణబాబు అభ్యర్ధిత్వంను ఫస్ట్ లిస్టులోనే ప్రకటించింది టీడీపీ. గణబాబును ఓడించాలనే గట్టిపట్టుదలతో ఇక్కడ బిగ్ షాట్ ఆడారి ఆనంద్ కుమార్‌ను పోటీ పెట్టింది వైసీపీ. నగరం నడిబొడ్డున విస్తరించిన ఈ సెగ్మెంట్లో పారిశ్రామిక ప్రాంతం ఎక్కువ. ఇక్కడ ఉత్తరాది, వలస ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. గవర సామాజిక వర్గానికి ఈ సీటును ప్రధాన పార్టీలు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. పశ్చిమలో కాపు ఓటింగ్ కీలకమైనది. జనసేన-టీడీపీ కలయిక కొంత మేర సిట్టింగ్ ఎమ్మెల్యేకు కలిసి వచ్చే చాన్స్ ఉంది. విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ ఇక్కడ బలమైన అభ్యర్ధి. టీడీపీ, వైసీపీ ఒకేసామాజిక వర్గానికి చాన్స్ ఇచ్చింది. ఆడారి ఫ్యామిలీ మొదటి నుంచి టీడీపీలోనే వుంది. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఆనంద్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరడంతో ఆయనకు స్టేట్ MSME కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు..2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు గెలుపొందారు.SC రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాయకరావుపేటలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరపున మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సీటు ఖరారు చేసింది. సీనియర్ శాసనసభ్యుడు, రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులును ఇక్కడి నుంచి బరిలోకి దించుతోంది వైసీపీ. రాజాంకు చెందిన జోగులును పంపడం ద్వారా పాయకరావుపేటలో కొత్త ముఖం తెచ్చిపెట్టింది. సౌమ్యుడిగా పేరున్న జోగులు మీద ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత బరిలోకి దించింది. అనిత 2014-19 మధ్య పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 లో కొవ్వూరు నుంచి పోటీ చేసి హోంమంత్రి తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు తొలి జాబితాలోనే అనిత టిక్కెట్ ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. ఇక్కడ జనసేన ఓట్ బ్యాంక్ చాలా కీలకమైంది.