విజయనగరం, ఫిబ్రవరి 29,
విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం నెల్లిమర్ల. ఇక్కడి నుంచి లోకం మాధవి పోటీ చేయబోతోంది. తొలి జాబితాలోనే ఆమె సీటు దక్కించుకున్నారు. వైసీపీ నుంచి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతున్నారు. వైసీపీ వర్సెస్ జనసేన పోటీ ఆసక్తికరంగా, హోరాహోరీగా ఉండబోతోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఇక్కడి నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆమె 4.4 శాతంతో 7,633 ఓట్లను సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పతివాడ నారాయణస్వామి నాయుడు 38.3 శాతంతో 66,207 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బడ్డుకొండ అప్పలనాయుడు 54.6 శాతంతో 94,528 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు జనసేన, టీడీపీ కూటమిగా బరిలోకి దిగుతుండడంతో పోటీ ఆసక్తిగా మారింది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బడ్డుకొండ అప్పలనాయుడు, జనసేన నుంచి పోటీ చేస్తున్న లోకం మాధవికి అంతర్గత పోరు తప్పడం లేదు. బడ్డుకొండ అప్పలనాయుడుకు ఇక్కడ స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బొత్స లక్ష్మణరావు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎమ్మెల్యేకు సమాంతరంగా ఆయన మరోవర్గాన్ని ఇక్కడ నడుపుతూ వస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ ఇబ్బందులను సిటింగ్ ఎమ్మెల్యే పరిష్కరించుకుని ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంది. జనసేన నుంచి పోటీ చేస్తున్న లోకం మాధవి కూడా ఇబ్బందులు ఉన్నాయి. జనసేనలో ఆమెకు ఇబ్బందులు లేవు. మాధవి భర్తకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె తొలి విడతలో సీటు దక్కించుకోగలిగారు. కానీ, టీడీపీ నుంచి ఇక్కడ సీటు ఆశించి భంగపడిన నేతలు ఆమెకు ఎంత వరకు సహకారాన్ని అందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీ ఇన్‌చార్జ్‌గా మొన్నటి వరకు ఉన్న కర్రోతు బంగార్రాజు జనసేనకు టికెట్ కేటాయించడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. గతంలో అనేకసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పని చేసిన పతివాడ నారాయణస్వామి నాయుడు ఈమెకు ఎంత వరకు సహకారాన్ని అందిస్తారన్నది చూడాల్సి ఉంది. వీరిని సంతృప్తి పరిచి ఎన్నికల క్షేత్రంలో తనకు అనుకూలంగా పని చేసేలా చూడాల్సిన అవసరం మాధవికి ఏర్పడింది.