YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అడ్డగోలుగా జీరో దందా...

అడ్డగోలుగా జీరో దందా...

నల్గోండ, ఫిబ్రవరి 29,
అది నాగార్జునసాగర్ సరిహద్దు చెక్ పోస్టు.. తెలంగాణ పరిధిలోకి వచ్చే ఈ చెక్ పోస్టు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.అసలే ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టు కావడంతో కాసులు కురుస్తున్నాయనే చెప్పాలి. అక్రమ సరుకులు, మద్యం, ఇతరత్రా జీరో దందాకు సంబంధించిన వాహనాలను ఒక్కో వాహనానికి రూ.3 - 5 వేలు వసూలు చేసి ఎంచక్కా వదిలేస్తున్న వైనం నాగార్జునసాగర్ సరిహద్దు చెక్ పోస్టులో నిత్యకృత్యంగా మారిపోయింది. నాగార్జునసాగర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల భారీగా మత్తు పదార్థాలు రవాణా జరుగుతుంది. నిజానికి అవి జీరో రవాణానో అనుకుని ముడుపులు తీసుకుని అధికారులు వాహనాలను చెక్ చేయకుండానే వదిలేస్తున్నారు. కానీ కొంతమంది అక్రమార్కులు వాటి మాటున మత్తు పదార్థాలను పెద్ద ఎత్తున రవాణా చేస్తుండటం గమనార్హం. ఇదే సమయంలో ఏపీ నుంచి హైదరాబాద్ మహానగరానికి చేరుకోవాలంటే.. హైదరాబాద్- విజయవాడ హైవే కంటే ఇది ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నారు. ఎందుకంటే.. పైసలిస్తే చాలు.. ఈ సరిహద్దు చెక్ పోస్టు మీదుగా ఏలాంటి వాహనమైన ఈజీగా ఎస్కేప్ కావచ్చు. ఇంటి దొంగలను ఈశ్వరుడైన పట్టుకోలేడన్న చందంగా సరిహద్దు చెక్ పోస్టుల్లో పరిస్థితి ఇలాగే ఉంది. కొందరు ఉద్యోగుల అవినీతి వాటం వలన ఖజానాకు గండి పడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్న వాహనాలకు క్షుణ్ణంగా తనిఖీ చేసి చర్యలు చేపట్టాల్సిన చెక్ పోస్ట్ అధికారులు ముడుపులకు ఆశపడి వాహనాల తనిఖీ చేయకుండానే వదిలి పెడుతున్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జోరుగా జీరో వ్యాపారం కొనసాగుతుంది. ఈ చెక్ పోస్ట్‌లో పనిచేసే కొంతమంది అధికారులు దండిగా సొమ్ము చేసుకుంటూ ఆస్తులు పెంచుకోవడం గమనార్హం.ఆర్టీఏ చెక్ పోస్టుల్లో జరిగే అవినీతిని అరికట్టేందుకు చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే అధికారులు, సిబ్బంది తెలివిగా సీసీ కెమెరాలను పక్కకు తిప్పి తమ పని కానిచ్చేస్తున్నారు. అంతరాష్ట్ర సరిహద్దుగా ఉన్న నాగార్జునసాగర్ చెక్‌పోస్టు మాముళ్లకు అడ్డాగా మారింది. ప్రస్తుతం ఉన్న శాఖలు చెక్‌పోస్టులను అడ్డాలుగా మార్చుకొని చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. పైకం అందిస్తే చాలు ఏ వాహనమైన దర్జాగా తరలిపోయే పరిస్థితి కొనసాగుతోంది. చెక్‌పోస్ట్‌లో రవాణాశాఖకు సంబంధించి ఎంవీఐ, ఏఎంవీఐలుతో పాటు ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 24గంటలకో ఒక బృందం షిప్ట్‌ల పద్ధతిలో మారుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి అటు ఇటు సరకులు తీసుకెళ్లే వాహనాలు తప్పనిసరిగా ఇక్కడ ఆగి పత్రాలపై ముద్ర వేయించుకొని వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల్లో ఏ సరుకు, ఎంత మేర సామర్థ్యంతో రవాణా అవుతుందో తనిఖీ చేయడం.. పత్రాలు సరిచూడటం ఇక్కడివారి బాధ్యత. కానీ ఈ సరిహద్దు చెక్ పోస్టులో అది అమలు కావట్లేదు.తనిఖీ కేంద్రం వద్ద వాహనం ఆగగానే సంబంధిత డ్రైవర్‌ అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి కాగితాలు చూపుతాడు. స్థాయిని బట్టి సొమ్ము చేతిలో ఉంచగానే వాహనాన్ని ముందుకు పంపిస్తారు. ఇందుకు ప్రైవేట్‌ వ్యక్తులు సహాయంగా ఉంటారు. సహకరించినందుకు వారికి కొంత వాటా ఇవ్వడం జరుగుతుంది. ఇదిలా వుంటే.. నాగార్జునసాగర్ చెక్‌పోస్టు వద్ద పని చేసేందుకు ఎక్కవ మంది అధికారులు ఆసక్తి చూపుతారు. ఇక్కడ విధుల నిర్వహణ అదృష్టంగా భావిస్తారు. పోస్టింగ్‌ రావడానికి లేదా డిప్యూటేషన్‌పై పని చేయడానికి పై అధికారులను ప్రసన్నం చేసుకొని మరీ పోస్టింగ్‌లు పొందుతుంటారు. ఇదిలావుంటే.. ఏపీ నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తు రవాణా జరుగుతుంటుంది. నిబంధనల ప్రకారం వీటికి జీఎస్టీ, సరుకు కొనుగోలు, రవాణా అనుమతి, ఇతర పన్నుల చెల్లింపు పత్రాలు ఉండాలి. వీటిలో ఏ పత్రాలు లేకున్నా సంబంధిత శాఖ ఆ లారీలను సీజ్ చేయాలి. వారిపై కేసు నమోదు చేసి, చెల్లింపులను ఫైన్‌తో సహా చేయించాలి. అయితే వ్యాపారులు జీరో దందాకు అలవాటుపడి పన్నులు ఎగవేస్తున్నారు. అధికారులను మచ్చిక చేసుకొని మామూళ్ల మత్తులో పెట్టి, దర్జాగా అధికారుల లెక్కల ప్రకారం సుమారు రూ.కోట్ల వరకు జీరో దందా కొనసాగుతుందని సమాచారం. అక్రమ రవాణా జరుగుతున్న వాటిలో ఐరన్, సిమెంట్, గ్రానైట్, ప్లాస్టిక్ పైపులు, పప్పులు, బియ్యం లాంటివి ఉన్నాయి. ప్రస్తుతం లారీలు సైతం హైదరాబాద్‌కు వే బిల్లులు లేకుండానే వెళుతున్నాయి. అధికారులకు ఈ విషయాలు తెలిసిన లంచాల మత్తులో జోగుతూ, తనిఖీలు నిర్వహించడం లేదు.

Related Posts