YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సమరానికి సై...

సమరానికి సై...

విజయవాడ, మార్చి 1
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరో పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక వచ్చే 45 రోజుల్లోనే ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల సమరానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేసి.. 45 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటించింది. వచ్చే 45 రోజుల్లో కనీసం నాలుగైదు సార్లు ఓటర్లను కలవాలని ప్లాన్‌ చేస్తోంది వైసీపీ. ఇదేసమయంలో ప్రతిపక్ష పార్టీ ఇంకా అభ్యర్థుల ప్రకటనపై నాన్చుతోంది. ప్రస్తుతానికి 99 నియోజకవర్గాలకు ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ-జనసేన. ఐతే ఈ 99లో చాలా చోట్ల అసంతృప్తులు చల్లారడం లేదు. ఇక జనసేనలోనూ సీట్ల లొల్లి పెరుగుతుండటంతో కూటమి రాజకీయం గందరగోళంగా కనిపిస్తోంది.ఏడు విడతల్లో దాదాపు 69 నియోజకర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించింది వైసీపీ.. దాదాపు 33 మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించింది. గెలుపు గుర్రాలకే టికెట్లు అని ప్రకటించిన సీఎం జగన్‌.. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతామని బెదిరించినా, వెనక్కి తగ్గలేదు. సర్వే ఫలితాల ప్రకారం ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టారు. పార్టీలో సుదీర్ఘ కసరత్తు చేసి పార్టీకి మరమ్మతు చేయాల్సిన చోట.. మార్పులతో కొత్త పుంతలు తొక్కించారు. ఇక తాజాగా జరిగిన మేము సిద్ధం.. మా పోలింగ్‌ బూత్‌ సిద్ధం సభలో మార్పుల ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు సీఎం జగన్‌.. అంటే దాదాపు 100 నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులకే మళ్లీ టికెట్‌ దక్కే అవకాశం ఉంది. జగన్‌ ప్రకటనతో ఇక వైసీపీలో మార్పులు లేనట్లేనని భావిస్తున్నారు. దాదాపు ఇన్‌చార్జులు అందరికీ టికెట్లు ఇస్తామని, ఒకటి రెండు చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయని సీఎం చెప్పడంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో హుషారు పెరిగింది. ఏడు విడతల్లో మార్పులు చేయడం.. 33 మందిని పక్కన పెట్టి, మరికొందరిని నియోజకవర్గాలు మార్చడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఇన్నాళ్లు అలజడి కనిపించింది. తమకు టికెట్లు దక్కుతాయా? లేదా? అన్న టెన్షన్‌ ఎక్కువగా ఉండేది. సీఎం జగన్‌ భరోసాతో మిగిలిన ఎమ్మెల్యేలు తమ సీటు సేఫ్‌ అనుకుంటూ హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు.అంతేకాకుండా వచ్చే 45 రోజులు ఏం చేయాలో? ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో? అన్నదానిపై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు కర్తవ్యబోధ చేశారు సీఎం జగన్‌.. ఎన్నికల యుద్ధానికి సకల అస్త్రాలు సిద్ధం చేసుకుని ప్రజాక్షేత్రంలో తిరగాలని సూచించారు. ఇలా వైసీపీ సమరోత్సాహంతో ప్రజల్లో దూసుకుపోయే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి మాత్రం ఇంకా ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతోంది.ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తొలి జాబితాలోనే ఉమ్మడిగా 99 మంది ఎమ్మెల్యేలను ప్రటించింది టీడీపీ-జనసేన కూటమి. ఈ నెల 23న ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌ చేశారు. ఐతే చాలా చోట్ల కొత్తవారికి అవకాశం ఇవ్వడం, జనసేన ఆశించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో అసమ్మతి భగ్గమంది. అంతేకాకుండా.. తొలి లిస్టులో సీనియర్లను పక్కన పెట్టడం కూడా అసంతృప్తికి దారితీస్తోంది. ప్రస్తుతానికి టికెట్ దక్కని నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు.నాలుగు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు, జనసేనాని మరోవైపు అసమ్మతులను బుజ్జగిస్తున్నారు. ఇదే సమయంలో కొత్తగా టికెట్లు దక్కించుకున్న వారు నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు చాయిస్‌తో టికెట్‌ కైవసం చేసుకున్న పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్‌కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గంలో రెండు పార్టీల కార్యకర్తలు తిరుగుబాటు చేస్తుండటం హీట్‌ పుట్టిస్తోంది. అదే విధంగా గజపతినగరం, కల్యాణదుర్గం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో పరిస్థితులు సర్దుకోలేదు. మొత్తంగా తొలి జాబితా టీడీపీ-జనసేన కూటమికి తలనొప్పిగా మారడంతో రెండో జాబితాపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.ఇంకోవైపు కూటమి నుంచి టీడీపీ రా కదలిరా సభలు నిర్వహిస్తోంది. జనసేనాని పవన్‌ వారాహియాత్ర పత్తా లేకుండా పోయింది. ఇప్పుడు ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభ తర్వాతైనా పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి పార్టీలు సభలకే పరిమితమవగా, అధికార పార్టీ జనం బాట పట్టడం ద్వారా ప్రతిపక్షంపై పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. ఏదిఏమైనా వచ్చే పది పదిహేను రోజులే రెండు ప్రధాన పార్టీలకు కీలకంగా చెబుతున్నారు.అసమ్మతులను, అసంతృప్తులను సర్దుబాటు చేయలేకపోతే టీడీపీ-జనసేన కూటమికి నష్టమని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో పార్టీలో అన్ని రకాలుగా సర్దుబాటు చేసుకుని వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తుండటం ఆ పార్టీకి కొంత అడ్వాంటేజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి వచ్చే కొద్దిరోజుల్లో జరిగే పరిణామాలే ఏపీ రాజకీయాలను శాసిస్తాయంటున్నారు.

Related Posts