YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒంగోలుకు ఒక న్యాయం... నెల్లూరుకు మరో న్యాయమా...

ఒంగోలుకు ఒక న్యాయం...  నెల్లూరుకు మరో న్యాయమా...

ఒంగోలు, మార్చి 1,
వైసీపీ అధినేత జగన్ ఎందుకో మాగుంట కుటుంబంపై కినుక వహించినట్లు కనపడుతుంది. మాగుంట కుటుంబానికి టిక్కెట్ నిరాకరించడంతో ఆ ఫ్యామిలీ అభిమానులు నిరాశలో పడ్డారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఎంత ప్రయత్నించినా మాగుంట కుటుంబానికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వడానికి మాత్రం జగన్ ససేమిరా అంటున్నారు. మాగుంట కుటుంబంలో టిక్కెట్ ఇవ్వకపోవడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెబుతున్నారు. అందువల్లనే జగన్ ఆ కుటుంబాన్ని దూరంగా ఉంచారంటున్నారు. ఆ కుటుంబానికి ప్రత్యేకంగా ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ, ఆర్థికంగా బలమైన, సామాజికవర్గ పరంగా కూడా మంచి పట్టున్న నేత అయినా ఆయనను కావాలని పక్కన పెట్టారన్న విమర్శలున్నాయి. కేవలం వైవీ సుబ్బారెడ్డి వల్లనే మాగుంట కుటుంబాన్ని పక్కన పెట్టారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. తన కుమారుడికి ఒంగోలు టిక్కెట్ ఇవ్వకపోతే, మాగుంట కుటుంబానికి కూడా ఇవ్వవద్దంటూ వైవీ సుబ్బారెడ్డి మెలిక పెట్టారని, జగన్ వైవీ మాటను కాదనలేకపోయారన్న వాదన కూడా వైసీపీలో వినిపిస్తుంది. పైకి మాత్రం ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయనతో పాటు కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పేరు కూడా ఉండటంతో ఇవ్వలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మాగుంట రాఘవరెడ్డికి మార్కాపురం, గిద్దలూరు అసెంబ్లీ టిక్కెట్ అయినా ఇవ్వాలని కోరినా జగన్ తిరస్కరించినట్లు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది మరి అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉండి, తర్వాత అప్రూవర్ గా మారిని శరత్ చంద్రారెడ్డిని నెల్లూరు పార్లమెంటు ఇన్‌ఛార్జిగా నియమించనున్నారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మాగుంట కుటుంబానికి, శరత్ చంద్రారెడ్డి కుటుంబానికి మధ్య తేడా ఏంటన్న ప్రశ్న ఒంగోలు వైసీపీ నేతల నుంచి వినిపిస్తుంది. మాగుంట కుటుంబం కొన్ని దశాబ్దాలుగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో తాగునీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం మాత్రమే కాకుండా విద్యాసంస్థలను కూడా నిర్వహిస్తుంది. అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరగా ఉన్న మాగుంటను కాదని నెల్లూరుకు శరత్ చంద్రారెడ్డిని ఎందుకు తీసుకొచ్చారని కొందరు నిలదీస్తున్నారు. పక్కపక్క జిల్లాలు కావడంతో... అయితే అదే సమయంలో ఒంగోలు పార్లమెంటు ఇన్ ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించినా ఆయన మాగుంటకు సరిపోయే నేత కాదన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. విజయసాయిరెడ్డి బంధువు కాబట్టే ఆయనకు సీటు ఇచ్చారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దూరం కావడంతో ఆర్థికంగా బలవంతుడు కావడంతోనే శరత్ చంద్రారెడ్డి పేరు బయటకు వచ్చింది. ఒంగోలు, నెల్లూరు పక్క పక్క జిల్లాలు కావడంతో అక్కడ ఒక న్యాయం.. ఇక్కడ ఒక న్యాయం ఎందుకు అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒంగోలుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పనికి రాని మాగుంట కుటుంబం.. నెల్లూరుకు అదే కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డిని నియమిస్తే జగన్ పరువు పెన్నాలో కలసిపోయినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి

Related Posts