విజయవాడ, మార్చి 1,
బెజవాడ పొలిటికల్ గ్రౌండ్‌పై ఉండే సాలిడ్ ఐకాన్ లీడర్లలో వంగవీటి రాధా కూడా ఒకరు. ఈసారి వంగవీటి రాధా పోటీ ఎక్కడ.? ఇదే ప్రశ్న రాధా అభిమానులను తొలిచేస్తోంది. టీడీపీ ఫస్ట్‌లిస్ట్‌లో రాధా పేరు లేకపోవడం..మరోవైపు రాధా రీఎంట్రీకి వైసీపీ ప్రయత్నిస్తుండం హాట్‌టాపిక్‌గా మారింది.టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌తో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. పొత్తుపార్టీల్లో టికెట్ దక్కని అసంతృప్త నేతలపై అధికార వైసీపీ దృష్టిపెట్టింది. ఇదే క్రమంలో వంగవీటి రాధాకు వైసీపీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాధా తిరిగి పార్టీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రాధాతో వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ రాధాతో భేటీయై పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. అయితే ఇప్పటివరకూ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు వంగవీటి రాధా. 2019లోనే రాధాకు బందరు ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది వైసీపీ. అయితే ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబట్టి పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు కీలక ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో ఉన్న రాధాతో మరోసారి టచ్‌లోకి వచ్చారు వైసీపీ నేతలు.ఉమ్మడి క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకింత పట్టున్న నేత వంగవీటి రాధా. సామాజికవర్గం.. ప్లస్ బ్రాండ్ నేమ్ రెండూ కలిపి.. ఆయనకంటూ ప్రత్యేకమైన ఓటుబ్యాంకు ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాధా..విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందారు. అయితే 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వంగవీటి రాధా.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడిన వంగవీటి రంగా..టీడీపీ చేరారు.టీడీపీ-జనసేన మొదటి జాబితాలో రాధాకు చోటు దక్కకపోవడం కృష్ణా జిల్లాలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. విజయవాడ సెంట్రల్ స్థానంపై రాధా ఆశలు పెట్టుకుంటే.. ఆ స్థానాన్ని బోండా ఉమా ఖాతాలో వేశారు చంద్రబాబు. 2009లో పుట్టుకొచ్చిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంతకు ముందు విజయవాడ ఈస్ట్‌లో భాగంగా ఉండేది. 1985లో వంగవీటి రంగా ఇక్కడినుంచే మొదటిసారి గెలిచారు. ఆ తరువాత వంగవీటి రత్నకుమారి వరుసగా రెండుసార్లు, 2004లో వంగవీటి రాధా మొదటిసారి సెంట్రల్‌లోనే గెలిచి అసెంబ్లీకెళ్లారు. ఇలా వంగవీటి ఫ్యామిలీకి కలిసొచ్చిన నియోజకవర్గాన్ని బొండా ఉమ ఎగరేసుకుపోయారు. కానీ.. మైలవరం, పెనమలూరు, విజయవాడ వెస్ట్, అవనిగడ్డ సెగ్మెంట్లను పెండింగ్‌లో ఉంచి సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు. కానీ.. ఆయా స్థానాల్లో ఇప్పటికే చాలామంది నేతలు క్యూలో ఉన్నారు. మైలవరం, పెనమలూరు టిక్కెట్ల కోసం విపరీతమైన పోటీ ఉంది.దాదాపు రెండు దశాబ్దాల పాటు బెజవాడ రాజకీయాలతో విడదీయరాని బంధం ఉంది రాధాకు. కొన్నాళ్లు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా, సెంకడ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా మొదలుపెట్టారు. పార్టీలకు అతీతంగా రంగా విగ్రహావిష్కరణలో, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాధా. ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిలబడ్డారు. టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే ఆయన వైసీపీ వైపు చూస్తారా..? లేక నచ్చిన సీటు దక్కించుకుని బరిలోకి దిగుతారా..? చూడాలి. వంగవీటి అభిమానులు మాత్రం తమ నేత ఈ సారి ఎలాగైనా బరిలో నిలవాలని కోరుకుంటున్నారు.