YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ధరణి సమస్యలకు పరిష్కారం...

ధరణి సమస్యలకు పరిష్కారం...

వరంగల్, మార్చి 1,
ధరణి పోర్టల్ లోని సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ఓ కమిటీని కూడా నియమించింది. గత కొద్దిరోజులుగా ఈ కమిటీ ధరణి పోర్టల్ పై సమీక్ష చేస్తోంది. క్షేత్రస్థాయిలో కూడా పర్యటిస్తూ పలు సమస్యలను తెలుసుకునే పని చేస్తోంది. ఇటీవలే ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.ధ‌ర‌ణి పోర్టల్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుదల చేసింది. సమస్యల పరిష్కారానికి త‌హ‌సీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏల‌కు అధికారాలను బ‌ద‌లాయింపు చేసింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గ‌ద‌ర్శ‌కాల్లో వెల్లడించింది. ప్రభుత్వం మార్గదర్శకాల ఫలితంగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు మోక్షం కలిగే అవకాశం ఉంది.వారం రోజుల పాటు ధరణి సమస్యలు పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. తహసీల్దార్, ఆర్టీవో, అడిషనల్ కలెక్టర్ల, కలెక్టర్ల సమక్షంలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ లో భద్రపరచనున్నారు. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ప్రచురించబడి ఆగిపోయిన అప్లికేషన్స్, ఫోటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించనున్నారు. అసైన్డ్ ల్యాండ్ ల సమస్యల వివరాలను కూడా సేకరించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను సీసీఎల్ఏ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.మండల ఆఫీసులో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కలిపి టీంలు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది ప్రభుత్వం. పెండింగ్ అప్లికేషన్లను మోజుల వైస్ విభజించాలని సూచించింది. అభ్యర్థుల ఫోన్ నెంబర్ల ద్వారా వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వెంటనే చేరవేయాలి అని వివరించింది. పెండింగ్ దరఖాస్తులను మార్చి ఒకటి నుంచి 9వ తేదీలోగానే క్లియర్ చేయాలని స్పష్టం చేసింది.భూరికార్డుల నిర్వహణకు గత ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ నిర్వహణ సర్వ అధికారాలను కూడా కలెక్టర్లకే కట్టబెట్టింది. ఫలితంగా చాలా దరఖాస్తులు పెండింగ్ లోనే ఉండిపోయాయి. దీని ద్వారా చాలా మంది భూహక్కుదారులు… తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ అంశాలను ఎన్నికల హామీలో ప్రధానంగా ప్రస్తావించింది కాంగ్రెస్. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను కూడా రద్దు చేసి భూమాతగా మారుస్తామని ప్రకటించింది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ధరణి పోర్టల్ సమస్యలపై దృష్టి పెట్టింది. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఏర్పాటైనా కమిటీ నుంచి మధ్యంతర నివేదికను తీసుకున్న సర్కార్…. తక్షణమే చేయావల్సిన మార్పులపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే… తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. చిన్న చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చూస్తోంది.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్‌గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ వ్యవహరిస్తున్నారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్‌ రేమండ్‌ పీటర్, భూ చట్టాల నిపుణుడు మా భూమి సునీల్‌, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.మధుసూదన్‌ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ధరణి పోర్టల్ ఉన్న సమస్యలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశించింది.
అసలు ధరణి ఏమిటి…?
• కాగితాల నుండి కంప్యూటర్లకు ఎక్కిన భూమి/రెవెన్యూ రికార్డులే ధరణి. అప్పటి 1బి రికార్డే ఇప్పటి ధరణి.
• 80వ దశకంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సి.ఎల్.ఆర్, ఆ తరువాత వచ్చిన ఎన్.ఎల్.ఆర్.ఎం.పి, ఇప్పుడు అమలులో ఉన్న డి.ఐ.ఎల్.ఆర్.ఎం.పి. పథకాలు భూమి రికార్డులను కంప్యూటరీకరించాలి అంటున్నాయి. భూమి రికార్డులు కాగితాల్లో ఉండొద్దు, కంప్యూటర్లోనే ఉండాలి అని నిర్దేశిస్తున్నాయి.
• భూమి రికార్డులన్నీ కంప్యూటర్లోనే ఉండాలి. భూమి పై హక్కులు వచ్చిన వెనువెంటనే రికార్డు మారాలి. అంతిమంగా భూమి రికార్డుకు ప్రభుత్వమే హామీ ఇచ్చే వ్యవస్థ తేవాలి అనేది ఈ పథకాల లక్ష్యాలు.
• ఇందులో భాగంగా వచ్చినవే ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన 'వెబ్ ల్యాండ్', తెలంగాణ ఏర్పడిన తరువాత వచ్చిన 'మా భూమి', ఇప్పుడున్న 'ధరణి'

Related Posts