రాష్ట్ర ప్రగతికి పరిశ్రమల ఎంత అవసరమో...ప్రజారోగ్యమూ అంతే ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. పరిశ్రమల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పారదోలాలని, వాటి వల్ల కలిగే ఉపయోగాలను వారికి వివరిస్తూ చైతన్యపర్చాలని ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో స్టేట్ ఇన్విస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీ(ఎస్ఐపిసి), పరిశ్రమల అనుమతిపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా స్టేట్ ఇన్విస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీ(ఎస్ఐపిసి) సమావేశంలో నాలుగు కంపెనీలకు అనుమతుల సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగింది. సెయింట్ గోబియన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, గ్రోబ్ మెషిన్ టూల్స్ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులకు ఎస్ఐపిసి పచ్చజెండా ఊపింది. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ కంపెనీ, ఆరిమా రిఫైనరీకి ఆయా యాజమాన్యాలు కోరిన భూముల కేటాయింపుల సాధ్యాసాధ్యాలపై కులంకుషంగా చర్చించాలని సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. తిరుపతి లో ఏర్పాటు చేసిన సెల్ కాన్ పరిశ్రమకు రెండో దశ పనులకు అనుమతులిస్తూ ఎస్ఐపిసి నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాలు కోరిన విధంగా కాకుండా ఎంత అవసరమో గుర్తించి, ఆ మేరకు భూములను కేటాయించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకునుగుణంగా భూముల ధరలు నిర్ణయించాలన్నారు. పరిశ్రమల స్థాపనతో ఉద్యోగాల కల్పనతో పాటు ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నారు. అదేసమయంలో పర్యావరణానికి ఎటువంటి హానీ కలుగరాదన్నారు.
పరిశ్రమల పట్ల ప్రజల్లో అపోహాలను తొలగించాలి...
పారిశ్రామిక పాలసీలో భాగంగా సింగ్ డెస్క్ పోర్టల్ విధానంలో సకాలంలో పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను ఆమోదించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సిద్ధార్థ జైన్ తెలిపారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం అమలైన నాటి నుంచి దరఖాస్తుల ఆమోదంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎస్ దినేష్ కుమార్ కు ఆయన వివరించారు. 2015-16లో 91.43 శాతం, 2016-16లో 96.89శాతం, 17-18లో 98.75 శాతం, 2018 మే వరకూ 99.91 శాతం మేర త్వరితగతిన ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. వివిధ కారణాలరీత్యా 40 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్నారు. దీనిపై సీఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, పరిశ్రమలపై ప్రజల్లో వ్యతిరేక భావం ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల ఆర్థికంగా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. దీనివల్ల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం కాలుష్యరహిత పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తున్న విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. పరిశ్రమల పట్ల ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగిస్తూ, పారిశ్రామిక ప్రగతి వల్ల కలిగే లాభాలపై వారిలో చైతన్యం కలిగించాలన్నారు. ప్రజల ఆరోగ్యం, రక్షణ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పలు శాఖ ముఖ్య కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, సాల్మన్ ఆరోఖ్య రాజ్, ఎ.బాబు తదితరులు పాల్గొన్నారు.