విజయవాడ, మార్చి 5
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికార వైసీపీ. కొందరు నేతలను ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోందా ? పార్టీని వీడిన ఆ ముగ్గురు నేతలను ఓడించేందుకు ముప్పేట దాడి చేయాలని నిర్ణయించిందా ?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కృష్ణా జిల్లాలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వారిపై అధికార పార్టీ ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమి తరపున బరిలోకి దిగుతున్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశారి, మాజీ మంత్రి, నూజివీడు అభ్యర్థి కొలుసు పార్థసారథి, మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను ఓడించాలన్న లక్ష్యంతో వైసీపీ హైకమాండ్ వ్యూహాలు రచిస్తోంది.వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేయడం ఆ పార్టీ అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గుర్ని ఎలాగైనా ఓడించాలని, అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు రెడీ అయినట్లు సమాచారం. జిల్లాలోని మైలవరం, పెనమలూరు అసెంబ్లీ స్థానాలతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో... ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో వైసీపీ హైకమాండ్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు నేతలు పార్టీని వీడే సమయంలో విమర్శలు చేసిన నేతలను ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించాలని కేడర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి... జిల్లా నుంచి మొట్టమొదట పార్టీ అధిష్టానంపై అసమ్మతి గళం వినిపించారు. ఈసారి పెనమలూరు నుంచి కాకుండా నూజివీడు నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బరిలోకి దిగడం ఖాయమైంది. యాదవుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో...పార్థసారథి నూజివీడుకు షిఫ్ట్ అయ్యారు. అయితే పార్థసారథిని ఓడించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఇన్ చార్జ్ గా పనిచేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టికెట్ దక్కకపోవడంతో... సీఎం జగన్ ను కలిశారు. ఆయన వైసీపీలో చేరుతారని భావించారు. అయితే మద్దరబోయిన వైసీపీలో చేరకపోవడానికి కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ముద్దరబోయిన వెంకటేశ్వరరావును ఇండిపెండెంట్ గా పోటీ చేయించి... ఓట్లను చీల్చాలన్న లక్ష్యంతో వైసీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఓట్లు చీల్చడం ద్వారా పార్థసారథిని ఓడించవచ్చనే ప్లాన్ చేస్తోంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్... ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థిగా వసంత పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఐదేళ్ళ పాటు వైసీపీలో ఉన్న వసంత... మంత్రి జోగి రమేష్ తో విభేదాలు ఉన్నాయి. అనేక అంశాల్లో ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ... టీడీపీ కండువా కప్పుకున్నారు. యాదవ వర్గానికి చెందిన సర్నాల తిరుపతి రావును వైసీపీ బరిలోకి దించింది. సాధారణ జడ్పీటీసీగా ఉన్న సర్నాల తిరుపతి రావుతోనే వసంతను ఓడించాలని ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. వసంతను ఓడించే బాధ్యతలను కొందరు సీనియర్ నేతలకు వైసీపీ అప్పగించినట్లు తెలుస్తోంది. వారికి అన్ని విధాలా సహయసహకారాలు అందించేందుకు రెడీ అయింది. మచిలీపట్నం ఎంపీ బాలసౌరి వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. బాలశారి టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంట్ నుంచి బరిలోకి దిగనున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును ప్రస్తుతానికి వైసీపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసిన బాలసౌరీ ఓడించి తీరాలని వైసీపీ అధిష్టానం పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.