YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నయా జూదంతో జనాలు గగ్గోలు

నయా జూదంతో  జనాలు గగ్గోలు

వరంగల్, మార్చి 5
ఇప్పుడు మన వాళ్లు ఆడే నయా జూదం ఆటలో ఓడిన వారు అడవులపాలు కాదు.. ఏకంగా తమ జీవితాలనే ఛిద్రం చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇది ఎదురుపడి ఆడే ఆట కానేకాదు. ప్రత్యక్షంగా సొమ్ములు పెట్టే పనీ లేదు. కానీ బ్యాంకు ఖాతా మాత్రం ఖాళీ అవుతోంది. ఈ ఆట దెబ్బకు సర్వస్వం కోల్పోయిన ధర్మరాజులూ లేకపోలేదు. "కాయ్ రాజా కాయ్" అంటూ ఒకప్పుడు తిరునాళ్లల్లో కనిపించిన పందేలు ఇప్పుడు ఆన్లైన్ వేదికగా జడలు విప్పాయి. మొబైల్ యాప్ లలో జూదం ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు క్షణాల్లో పెద్ద మొత్తంలో నష్టపోయి దివాళా తీస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆటో, నేనో తేల్చుకోవాలని పంతంపడుతున్న కొందరు అప్పులు చేసి మరీ ఆటలో గుమ్మరిస్తున్నారు. చివరికి మళ్లీ డబ్బులు పోగొట్టుకుని చేసిన అప్పులు తీర్చలేక ఉన్న ఆస్తులు అమ్మేందుకు సైతం తెగిస్తున్నారు. ఆస్తులు లేని వారు మరో మార్గం దొరక్క ఇక చావే శరణ్యమని భావించి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇంకొందరు మానసిక ఆందోళనలో పడి కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారు.సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ గన్ మెన్ ఆన్లైన్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేదారిలేక, భార్యా పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ పలువురు యువత, ఉద్యోగులు ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ఇదే కారణంతో కొద్ది నెలల కిందట సత్తుపల్లి నియోజకవర్గంలో ఓ పచ్చని సంసారం ఆగమైంది. ఆన్లైన్ లో బెట్టింగ్ పెట్టి సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న కొందరు యువకులు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూదం ఏదైనా ఆ ఊబి లోంచి బయటపడటమే ఉత్తమమని పోలీసులు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సత్తుపల్లికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేసి బాగా సంపాదించాడు. భార్యా పిల్లలతో సుఖ సంతోషాలతో జీవనం సాగించాడు. ఈ క్రమంలో సులభమైన పద్ధతిలో మరింత డబ్బు సంపాదించాలనే అత్యాశ అతని మెదడును తొలిచింది. ఇందుకు ఆన్లైన్ బెట్టింగ్ మాత్రమే సరైన వేదిక అనుకుని బెట్టింగ్ మాయలో పడ్డాడు. చివరకు తీవ్రంగా నష్టాలపాలయ్యాడు.
ఆర్థికంగా నష్టపోయిన తర్వాత ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. డబ్బు పోగొట్టుకున్న విషయమై భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తిరిగి సత్తుపల్లికి వచ్చేశారు. అప్పటికే తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆ ఇల్లాలు.. తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడడం హృదయాలను పిండేసింది. పెనుబల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ మధ్య కాలంలో ఆన్లైన్, క్రికెట్ బెట్టింగుల్లో పెట్టుబడులు పెట్టి దాదాపు రూ.2.50 కోట్లు నష్టపోయాడు. పీకల్లోతు అప్పుల్లోంచి బయటపడటం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు మండలాల్లో ఎంతో మంది యాప్ ద్వారా పందేలు కాసి తీవ్రంగా నష్టపోయారు.బెట్టింగ్.. ప్రసుత్తం పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా 18 నుంచి 40ఏళ్లలోపు వారిని విపరీతంగా ఆకర్షిస్తున్న జాడ్యం ఇది. చెమటోడ్చి సంపాదించడానికి మొగ్గు చూపని యువత ఇలాంటి వ్యాపకాలతో కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో స్నేహితుల ద్వారా ఆన్లైన్ ప్రకటనల ప్రలోభాలతో ఈ ఉచ్చులోకి దిగుతున్నారు. జూదం నిర్వాహకులు మొన్నటి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనూ పందేలకు వేదికగా మలుచుకోవడం గమనార్హం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలుసైతం ఈ బెట్టింగ్ వేదిక మీదికి వచ్చి చేరడం గమనార్హం. 'ఏ అభ్యర్థి గెలుస్తాడు? ఏపార్టీ అధికారంలోకి వస్తుంది?' అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు కాసినట్లు సమాచారం. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వారికి ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగు సైబర్ నేరగాళ్లు ఎర వేస్తున్నారు. తొలుత కొంత లాభం ఆశ చూపి ఆ తర్వాత కదలకుండా ఉచ్చు బిగించి అందినకాడికి దోచేస్తున్నారు. ధనిక, పేద, మధ్య తరగతి, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, యువత అనే తేడా లేకుండా ఎవరో ఒకరు తరచూ మోసపోతూనే ఉన్నారు.బాధితుల్లో అత్యధికులు స్మార్ట్ ఫోన్ లపై గంటల కొద్దీ సమయం గడుపుతున్న వారే ఉండటం గమనార్హం. తొలుత కొంత నష్టపోతున్న ఆటగాళ్లు మళ్లీ తిరిగి పొందలేకపోతామా? అన్న ధీమాతో అప్పులు చేసి మరీ ఆటలో గుమ్మరిస్తున్నారు. సులువుగా అప్పు దొరుకుతుండటంతో ఆన్లైన్ రుణ యాప్ లను ఆశ్రయిస్తుండటం మరో ఊబిలోకి దిగుతున్నట్లు అవుతోంది. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి తమను తామే కాపాడుకోలేనంత ఉచ్చులోకి వెళ్లిపోతున్నారు. అప్పులు ఇచ్చిన వ్యక్తులు వేధిస్తున్న క్రమంలో డిప్రెషన్ కు లోనవుతున్నారు. అప్పుల బాధ భరించలేక ఆస్తులు అమ్ముకున్న వారు కొందరుంటే ఆత్మహత్యలకు పాల్పడి జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్న వారు లేకపోలేదు. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ లో సాగిపోతున్న ఈ నయా జూదానికి పోలీసులు సైతం ముకుతాడు వేయలేకపోతున్నారు. ఆస్తులు కోల్పోయి ఆత్మహత్యలు జరిగినప్పుడు మాత్రమే ఇవి వెలుగు చూడటం విచారకరం

Related Posts