YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గాజువాక వైసీపీలో తర్జనభర్జనలు

గాజువాక వైసీపీలో తర్జనభర్జనలు

విశాఖపట్టణం, మార్చి 6
గాజువాక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయబోయే అభ్యర్థిపై వైసీపీలో తర్జనభర్జన కొనసాగుతోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. సర్వేలు, స్థానికంగా ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. ఈ క్రమంలోనే కార్పొరేటర్‌ వురుకూటి రామచంద్రరావును గాజువాక ఇన్‌చార్జ్‌గా కొద్దిరోజుల కిందట నియమించారు. ఈ నిర్ణయాన్ని సిటింగ్‌ ఎమ్మెల్యే నాగిరెడ్డి వ్యతిరేకించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇన్‌చార్జ్‌గా ప్రస్తుతం రామచంద్రరరావు కొనసాగుతున్నారు. కానీ, రామచంద్రరరావు అభ్యర్థిత్వంపై మంత్రి బొత్స సత్యనారాయణ అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. గాజువాక అభ్యర్థిని మార్చాలని వైసీపీ అధిష్టానానికి బొత్స సూచించారని, ఈ మేరకు నిర్ణయం వెలువడుతుందంటున్నారు. విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి రానున్న ఎన్నికల్లో బొత్స ఝాన్సీ లక్ష్మి బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆమె అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసింది. బొత్స ఝాన్సీ లక్ష్మి భర్త బొత్స సత్యనారాయణ సీనియర్‌ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అనుభవమున్న నేతగా ఆయనకు పేరుతుంది. ఆర్థిక, అంగ బలం కలిగిన నేత కావడంతో బొత్సకు అంతే ప్రాధాన్యతను సీఎం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బొత్స భార్యను విశాఖ పార్లమెంట్‌ స్థానానికి వైసీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకుని ఖరారు చేసింది. ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చెబుతున్న విశాఖకు సీఎం భవిష్యత్‌లో రావాలంటే ఇక్కడి స్థానాన్ని వైసీపీ తప్పక గెలవాలి. అప్పుడే ఇక్కడి ప్రజలు ఎగిక్యూటివ్‌ క్యాపిటల్‌ను స్వాగతిస్తున్నారని చెప్పేందుకు వీలుంటుంది. ఇతర అభ్యర్థులతో పోలిస్తే బొత్స ఝాన్సీ బలమైన అభ్యర్థిగా అధిష్టానం భావించడం వల్లే ఆమె పేరును ప్రకటించారు. బొత్స ఝాన్సీ విజయం అధిష్టానానికి ఎంత కీలకమో.. ఈ ప్రాంతానికి సీనియర్‌ నేతగా ఉన్న బొత్సకు అంతే కీలకం. అందుకే బొత్స విశాఖ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన నేతలు ఉండడంతో ఆయన కూడా విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఒక్క గాజువాక నియోజకవర్గంలో మాత్రం బలహీనమైన అభ్యర్థి ఉన్నాడని భావిస్తున్న బొత్స.. మార్చాలని అధిష్టానానికి సూచించినట్టు చెబుతున్నారు. గాజువాక నియోజజకవర్గంలో యాదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న తిప్పల నాగిరెడ్డి ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఆయన వద్దనుకున్న పక్షంలో యాదవ సామాజికవర్గానికి చెందిన ప్రస్తుత విశాఖ నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారిని బరిలో దించాలని బొత్స భావిస్తున్నారు. ఈ మేరకు అధిష్టానానికి ఆయన సూచించినట్టు చెబుతున్నారు. మేయర్‌గా సమర్థవంతంగా పని చేయడంతోపాటు రాజకీయంగా వివాదాలకు అతీతంగా ఆమె వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీలోనే పని చేస్తుండడం కూడా వీరికి కలిసి వచ్చే అంశం. బొత్స ఆశీస్సులు కూడా ఉండడంతో వీరి పేరు ఖరారు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ మేరకు ప్రకటన కూడా రావచ్చని చెబుతున్నారు.

Related Posts