విశాఖపట్టణం, మార్చి 6
విశాఖ జిల్లాలో పోటీ చేయబోయే స్థానాలు, అక్కడ పోటీ చేయనున్న అభ్యర్థులకు పవన్ సూచాయగా చెప్పినట్టు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఇన్‌చార్జ్‌లను ఆయా నియోజకవర్గాలకు పవన్ కల్యాణ్ నియమించాలని తొలుత భావించారు. పొత్తులో ఉండడం వల్ల ఇతర పార్టీలతో ఇబ్బందులు, అక్కడ ఆయా పార్టీలు నేతలు ఎలా స్పందిస్తారన్న సందేహాలు నెలకొన్న సమయంలో ఆ నిర్ణయాన్ని పవన్ వాయిదా వేసుకున్నారు. విశాఖ జిల్లాలో జనసేన పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఆ నియోజకవర్గాలకే ఇన్‌చార్జ్‌లను పవన్ నియమించాలని భావించి వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో గాజువాక, పెందుర్తి, భీమిలి, యలమంచిలి స్థానాలను జనసేన ఆశిస్తోంది. విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్ ఈ స్థానాలకు ఇన్‌చార్జ్‌లను నియమించాలని భావించారు. భీమిలికి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్, యలమంచిలికి సుందరపు విజయ్ కుమార్, పెందుర్తికి పంచకర్ల రమేష్‌బాబును నియమించాలని భావించారు. ఈ మేరకు ప్రకటన విడుదలకు సిద్ధమైనట్టు చెబుతున్నారు. కానీ, పొత్తుపై ప్రభావం ఉంటుందన్న ఉద్ధేశంతో వెనక్కి తగ్గారు. కానీ, పొత్తులో భాగంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లను కోరుతున్న జనసేన.. విశాఖలో కూడా నాలుగు స్థానాలు కోరుతున్నట్టు చెబుతున్నారు. ఆ నాలుగు స్థానాలు ఇవేనని పేర్కొంటున్నారు. ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలతోపాటు అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని జనసేన కోరుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, నాలుగు రోజులు కిందట ఈ జిల్లాలో పర్యటించిన నాగంద్రేబాబు ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలతోనూ సమావేశమయ్యారు. తన మనసులోని మాటను సన్నిహితులు వద్ద చెప్పడంతోపాటు ఆ దిశగా క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించినట్టు చెబుతున్నారు.గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి బావ అల్లు అరవింద్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో కాపులు అత్యధికంగా ఉండడంతోపాటు మెగా ఫ్యామిలీకి అత్యధిక సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ పార్లమెంట్ స్థానంలో కూటమి కూడా బలంగా ఉన్నట్టు నాగబాబు నిర్వహించుకున్న అంతర్గత సర్వేలో తేలింది. దీంతోనే ఆయన ఇక్కడకు పోటీకి సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అయ్యన్న కుమారుడితోపాటుమరో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నప్పటికీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇది నాగబాబుకు సానుకూలంగా మారుతుందని చెబుతున్నారు.