బీజేపీ నేతలు తమ శత్రువులని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ అనడం దుర్మార్గమని బీజేపీ ఏపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. బుధవారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ మహానాడుపై ఎవరైనా విమర్శలు చేస్తే తెలుగుదేశం నాయకులు సహించలేకపోతున్నారని అన్నారు. రమణ దీక్షితులు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారని వ్యాఖ్యానించారు. గుజరాత్ పారిశ్రామిక ప్రాంతంలో దలైలా నగరం అభివృద్ధి చేస్తుంటే, కేంద్ర నిధులు మళ్లించారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. దీనిపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని, అది ప్రజల భాగస్వామ్యంతోనే నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. కేంద్ర నిధుల నుంచి ఒక్క పైసా కూడా ఈ నగరంలో పెట్టడం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు తాను సీనియర్ అని చెప్పుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గించాలని అధికారులకు సూచించడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలలో చంద్రబాబుకి ఓటేస్తే తెలుగు జాతిని అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. విశాఖ భూ కుంభకోణాలపై చంద్రబాబు, లోకేష్‌ల పేర్లు వినిపిస్తున్నాయని, సిట్ దర్యాప్తు పూర్తిచేసి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినా ఇంత వరకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఇందులో మంత్రి గంటా శ్రీనివాస్ అనుచరుల పేర్లు ఉన్నాయనే భయపడుతున్నారని, వెంటనే నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.