YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మరో ఎమ్మెల్యే రెఢీ...

మరో ఎమ్మెల్యే రెఢీ...

హైదరాబాద్, మార్చి 6,
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో వరుస భేటీలు అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య భేటీ అయ్యారు. సచివాలయంలో రేవంత్‌ను యాదయ్య కలిశారు. లోక్‌సభ ఎన్నికలకు ఈ వారంలో ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదవ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో త్వరలో యాదవ్ పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలవగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కలవడం గులాబీ వర్గాలను టెన్షన్ పెట్టిస్తుంది.
కాలె యాదయ్య చేవెళ్ల నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ నుంచి కేవలం 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేయడంతో ఆ పార్టీ నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కూడా ఉండటంతో తిరిగి హస్తం గూటికి చేరాలని యాదయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రేవంత్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు రేవంత్‌తో యాదయ్య చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అన్నీ అనుకూలిస్తే త్వరలో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో యాదయ్య కండువా కప్పుకునే అవకాశాముందని వార్తలొస్తున్నాయి.పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలోని మెజార్టీ ఎంపీ సీట్లను గెలుచుకునేందుకు వ్యూహలు రచిస్తుంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీలో చేరేందుకు నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల రేవంత్‌ను కలవగా.. ఇప్పుడు యాదయ్య కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసపెట్టి రేవంత్‌ను కలుస్తుండటంతో.. పార్టీ మారేందుకేనని ప్రచారం జరుగుతోంది. కానీ సీఎంను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాత్రం బయటకు చెప్పడం లేదు. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు కలుస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. రాష్ట్రంలో విచిత్ర పరిస్ధితి నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తుండగా.. సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాషాయ పార్టీలో చేరారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కమల తీర్థం పుచ్చుకోగా.. ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో బీబీ పాటిల్‌కు అదే నియోజకవర్గం నుంచి సీటు కన్ఫామ్ అయింది.  నాగర్‌కర్నూల్ నుంచి రాములు కుమారుడు భరత్‌కు బీజేపీ సీటు కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ పదే పదే పదే వ్యాఖ్యానిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వేరే దారి చూసుకుంటుండటంతో.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది.

Related Posts