YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ బీజేపీ..అంతా కన్ఫ్యూజన్

ఏపీ బీజేపీ..అంతా కన్ఫ్యూజన్

విజయవాడ, మార్చి 6,
ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా..? లేకుంటే టీడీపీ-జనసేన కూటమితో పొత్తులతోనే ముందుకు వెళ్లాలా..? అనే దానిపై హైకమాండ్ తేల్చడం లేదు.  ఇందుకోసమే ఏపీ బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అటు పార్లమెంట్.. ఇటు అసెంబ్లీలో ఏపీ నుంచి నేతలు తప్పకుండా అడుగుపెట్టాల్సిందేనని హైకమాండ్ గట్టిగానే వ్యూహ రచన చేస్తోంది. బోణీ కొట్టాలన్నదే ప్రస్తుతం ఏపీ కమలనాథుల టార్గెట్ అంటున్నారు.  ఇటీవల రాష్ట్ర నేతలతో హైకమాండ్ ప్రతినిధితో జరిగిన చర్చల్లో  బీజేపీ పొత్తు అంశం హాట్ టాపిక్‌గా నిలిచింది. పొత్తుపై పార్టీ కీలక నేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను సేకరిస్తున్నట్లు బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వెల్లడించారు. దాంతో పాటుగా రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒంటరి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది? అన్న అంశాలపై కూడా చర్చిస్తున్నామని, ఏది ఏమైనా పొత్తు విషయంలో తుది నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో  టీడీపీ-జనసేన పొత్తు కూడా కుదుర్చుకున్నాయి. ఈ పొత్తులో తమతో పాటు బీజేపీ కూడా కలుస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే పొత్తు అంశంలో ప్రస్తుతం ఏపీ బీజేపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు పొత్తుకు సుముఖత వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం పొత్తు లేదు ఏమీ లేదు.. లోక్‌సభ సహా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని పేర్కొంటున్నారు.  విజయవాడలో ఏపీ బీజేపీ పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూడా పొత్తుపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.  ఇందులో పాల్గొన్న నేతల్లో కొందరు సమావేశంలో పొత్తుపై చర్చ జరిగిందంటే మరికొందరు మాత్రం పొత్తు ప్రస్తావనే రాలేదన్నారు. దీంతో రాష్ట్రంలో పొత్తు అంశంపై కమలం క్యాడర్‌లో కన్ఫ్యూజన్ వస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో బీజేపీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. ఏపీలో మాత్రం ఆ ప్రక్రియను చాలా రొటీన్ గా నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన తర్వాత  నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు.  పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వకుండా ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లు ఖరారు చేసి పంపాలని సూచించారు.  ఇందులో భాగంగానే జిల్లాల ముఖ్యనేతలు, ఇన్‌ఛార్జ్‌లతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమావేశం నిర్వహించారు. హైకమాండ్ ప్రతినిధిగా శివప్రకాష్ వచ్చారు. ల పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ చేశారు.  ఇప్పటికే ఎన్నికల కోర్ కమిటీ, త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా బీజేపీ జాతీయ నేతలు అభ్యర్థుల వడపోత చేస్తారు.
హైకమాండ్ చెప్పినట్లు నడుచుకుంటూ తాము రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ఇందులో పార్టీ కార్యకర్తలంతా ఐకమత్యంతో పాల్గొంటారని ధీమా వ్యక్తం చేశారు.అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. బీజేపీ మాత్రం..ఎలాంటి ప్రిపరేషన్లు చేపట్టలేకపోయింది. ఇంత వరకూ కనీస ప్రచార ప్రణాళిక లేదు. ఒక్క బహిరంగసభ నిర్వహించలేదు. చిన్న చిన్న కార్యక్రమాలు ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. దీనికి కారణం పొత్తులు ఖచ్చితంగా ఉంటాయన్న ఓ నమ్మకమే. అయితే కారణాలేమిటో కానీ.. అసలు అడుగు ముందుకు పడటం లేదు. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు అన్ని స్థాయాల్లో పోటీ చేయడం కూడా సాధ్యం కాని విషయం. గతంలోలా నిలబడితే.. ఒక్క చోట కూడా డిపాజిట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. పొత్తుల్లో నిలబడితే కనీసం ప్రాతినిధ్యం ఉంటుందన్న అభిప్రాయంతో  కొంత మంది ఉన్నారు. ఆంధ్రాలో టీడీపీ-జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ అధిష్టానం సుముఖత కనబరుస్తున్నట్లు చెబుతున్నారు.  అందుకనే లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో బీజేపీ ఆంధ్రా నుంచి ఒక్కరి నుంచి కూడా ప్రకటించలేదని, పొత్తుపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆంధ్ర ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందని పలు నివేదికలు కూడా పేర్కొంటున్నాయి.   ఆంధ్రాలో బీజేపీ పొత్తు దాదాపు ఖరారైందని, స్థానాల విషయంలో స్పష్టత లేనందుకే బీజేపీ తన తొలి జాబితాలో ఆంధ్రా నుంచి ఎవరినీ ప్రకటించలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై బీజేపీ హైకమాండ్ కమిటీతో పాటు కీలక నేతలు కూడా చర్చిస్తున్నారని, కాగా నేతల నుంచి పొత్తు విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది. అయితే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్యను పెంచుకోవడానికి, ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఈ విషయంపై క్లారిటీ లేకనే బీజేపీ కూడా గందరగోళానికి గురవుతోంది.  

Related Posts