YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయసాయిరెడ్డి సెట్ చేస్తారా

విజయసాయిరెడ్డి సెట్ చేస్తారా

నెల్లూరు, మార్చి 7
నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ గా నియమితులైన విజయసాయిరెడ్డి  వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. విజయసాయిరెడ్డి ఎంట్రీతో నెల్లూరు రాజకీయం మరింత వేడెక్కింది.   ఆయన వ్యూహాలతో వైసీపీ నాయకులు ముందడుగు వేయడానికి రెడీ అయ్యారు. 2019లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాతే పరిస్థితి తారుమారైంది. ఐదేళ్లు గడిచేలోగా ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారారు. జిల్లానుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నమ్మకస్తులు, బలమైన నేతలంతా టీడీపీవైపు వెళ్లడంతో నెల్లూరులో వైసీపీ ప్రయాణం ఇబ్బందిగా మారింది. ఈ దశలో సీఎం జగన్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ట్రబుల్ షూటర్ గా ఆ జిల్లాకు స్థానిక నాయకుడైన విజయసాయిరెడ్డిని అక్కడకు పంపించారు.నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నా.. ఎప్పటికప్పుడు జిల్లా రాజకీయాలపై ఆయన దృష్టిసారించేవారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది అనుకున్నా.. వీపీఆర్ పార్టీని వీడటంతో జిల్లాలో అలజడి మొదలైంది. ఆయనతోపాటు చోటామోటా నేతలంతా టీడీపీలోకి వెళ్లిపోయారు. ఈ దశలో పార్టీకి పునర్వైభవం రావాలంటే విజయసాయి అవసరం అని భావించిన జగన్.. ఆయన్ను నెల్లూరు నుంచి లోక్ సభ బరిలో నిలిపారు. ఇప్పటి వరకు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో ఆ స్థానాన్ని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చారు. ఇటీవల తూర్పు రాయలసీన ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. ఇప్పటికే ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఉన్నారు. దీనితోపాటు ఆయన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్.  ఓ దశలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి పేరు వినిపించినా.. జగన్ మాత్రం తొలిసారి మైనార్టీలకు అవకాశం ఇచ్చారు.  నెల్లూరు సిటీలో మైనార్టీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.   అదే వ్యూహంతో ఆయన అక్కడ మైనార్టీ అభ్యర్థిని బరిలో నిలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఉన్న వ్యతిరేకతను కూడా తగ్గించేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనిల్ ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించారు. నెల్లూరు సిటీలో నారాయణకు ప్రత్యర్థిగా మైనార్టీని బరిలో నిలిపారు.   మొత్తమ్మీద కీలక నేతలంతా చేజారినా నెల్లూరులో పట్టు నిలుపుకోడానికి సీఎం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డితో మంత్రాంగం మొదలు పెట్టారు. నేతలు పార్టీ వీడినా, కేడర్ చెదిరిపోకుండా కాపాడే బాధ్యత విజయసాయికి అప్పగించారు. ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Related Posts