YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పెట్రోలు బంకులకు సుతిమెత్తని వార్నింగ్

పెట్రోలు బంకులకు సుతిమెత్తని వార్నింగ్

హైదరాబాద్, మార్చి 7,
ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందంటే ఇదే కాబోలు. మరో పది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు ప్రకటన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పది సంవత్సరాలలో తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు.. ఎలాంటి వరాల జల్లు ప్రజలపై కురిపించిందో వివరించేందుకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనుంది. అయితే ఈ భారాన్ని మొత్తం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలపై మోపనుంది. ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మనదేశంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ వంటి సంస్థలు ప్రభుత్వ ఇంధన రిటైలర్లుగా ఉన్నాయి. వీటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 88 వేల పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. ఈ బంకుల పరిధిలో ప్రధానమంత్రి మోడీ ఫోటోతోపాటు.. ఈ పది సంవత్సరాలలో అమలు చేసిన పథకాలను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని కేంద్రం ఈ కంపెనీలను ఆదేశించింది. సాధారణంగా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద 40*20 పరిమాణంలో హోర్డింగ్ ఉంటుంది. దీనికి అదనంగా రెండు లేదా మూడు డిస్ ప్లే బోర్డులు ఉంటాయి.. ఇవి కాకుండా భారీ పరిమాణంలో హోర్డింగులు నిర్మించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని పెట్రోల్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. కేంద్రం తాజా ఆదేశాలతో చమరు కంపెనీలు ఫ్లెక్సీ ప్రింటింగ్ ఖర్చు కోసం చదరపు అడుగుకు 12 రూపాయల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక నగరాల్లో అయితే ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.2021 సంవత్సరంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగుతాయనగా చమురు కంపెనీలు బంకుల వద్ద ఇదేవిధంగా ప్రచార చిత్రాలను ఏర్పాటు చేశాయి. అప్పట్లో కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో చమరు కంపెనీలు ఆ విధంగా చేయాల్సి వచ్చింది. ఇలా మోడీ ప్రచార చిత్రాలు ఏర్పాటు చేయడం పట్ల మమతా బెనర్జీ, స్టాలిన్, విజయన్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రచార చిత్రాలను తొలగించారు. కాగా, త్వరలో పార్లమెంట్ ఎన్నికలకు ప్రకటన రానున్న నేపథ్యంలో బుధవారం లోపు దేశవ్యాప్తంగా ఉన్న 88వేల పెట్రోల్ బంకుల వద్ద మోడీ చిత్రపటాలతో కూడిన ప్రచార చిత్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం కోరింది. ఇలా చేయనివారిపై చర్యలకు ఉపక్రమించేందుకు వెనుకాడబోమని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తమపై ఆ కారణంగా విరుచుకుపడే ప్రధాని.. ఈ ప్రచార యావను ఎలా సమర్థించుకుంటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Related Posts