YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ

 ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ

విజయవాడ, మార్చి 7,
ఎన్‌డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం దాదాపు ఖరారైంది. ఈ నెల తొమ్మిదో తేదీన లాంఛనంగా తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏ కూటమిలో చేరనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ మేరకు బీజేపీ అధినాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందినట్టు చెబుతున్నారు. గత నెలలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పొత్తు చర్చల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయని, ఒకటి, రెండు రోజుల్లో కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరుతుందని ఇరు పార్టీల నేతలు చెబుతూ వచ్చారు. కానీ, బీజేపీ కూటమిలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ చేరలేదు. ఆ తరువాత ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా సాగలేదు. మళ్లీ చంద్రబాబు ఢిల్లీకి వెళతారని, పవన్‌ కల్యాణ్‌ వెళ్లి మాట్లాడారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే అనేక ఊహాగానాలు వచ్చాయి. పొత్తు మరి లేదంటూ కొన్ని వర్గాలు ప్రచారమూ చేశాయి. ఈ క్రమంలోనే పొత్తు ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, ఈ నెల తొమ్మిదో తేదీన టీడీపీ, జనసేన పార్టీలు ఎన్‌డీఏ కూటమిలో చేరుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పొత్తులు, ఇతర అంశాలపై చర్చించేందుకు బీజేపీ అగ్రనేతలు హోంమంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సిద్ధమవుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు కీలక నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.    వీరితో గురు, శుక్రవారాల్లో అమిత్‌ షా, జేపీ నడ్డా సమావేశమై తుది నిర్ణయం దిశగా చర్యలు తీసుకోనున్నారు.  పొత్తు లేకపోయినా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నదీ, లేనిదీ ఈ సమావేశంలో అగ్రనేతలు తెలుసుకోనున్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ బీజేపీ కేంద్ర నాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. కానీ, రాష్ట్రం నుంచి బీజేపీ సింబల్‌పై గెలిచే కొన్ని స్థానాలను అగ్రనాయకత్వం కోరుకుంటోందని తెలుస్తోంది.   వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు బీజేపతో పొత్తుకు సిద్ధంగా లేదు.  బయట  నుంచి మాత్రం సహకారాన్ని ఎల్లప్పుడూ అందించేందుకు సిద్ధంగా ఉంటోంది. ఇదే ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వాన్ని పొత్తు వైపు వెళ్లేలా చేస్తోందని అంటున్నారు.  పొత్తులో భాగంగా కొన్ని సీట్లు తీసుకుని రాష్ట్రంలో ప్రాతినిధ్యం సంపాదించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే పొత్తుకు అగ్రనాయకత్వం సుముఖతను వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు.పొత్తులో భాగంగా ఐదు ఎంపీ, తొమ్మిది నుంచి పది ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కోరే అవకాశముంది. ఎంపీ స్థానాల్లో అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఎంపీ స్థానాలు ఉన్నట్టు చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లో గుంటూరు వెస్ట్‌, విశాఖ నార్త్‌, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, శ్రీకాళహిస్తతోపాటు తిరుపతి, గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో సీటు కోరే అవకాశముందని చెబుతున్నారు. ఇంకా, బలమైన నేతలు ఉంటే రాష్ట్ర నాయకత్వం కోరిక మేరకు ఆయా స్థానాలను కోరే చాన్స్‌ ఉందని, దాదాపు పొత్తు పూర్తయినట్టేనని చెబుతున్నారు.

Related Posts