YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గౌరవం లేని వాడు సీఎం...

గౌరవం లేని వాడు సీఎం...

హైదరాబాద్, మార్చి 7
 సీఎం రేవంత్ కు తెలంగాణ ఆత్మ, రాష్ట్రంపై గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ సోయి లేనోడు మన సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మ గౌరవం విలువ తెలీనోడు సీఎంగా ఉండడం మన దౌర్భాగ్యం అంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మ గౌరవంపై దాడి చేశారని అన్నారు. 'అసలు గోల్ మాల్ గుజరాత్ మోడల్ కు, గోల్డెన్ తెలంగాణ మోడల్ తో పోలికెక్కడిది.? ఘనమైన గంగా జమునా తెహజీబ్ మోడల్ కన్నా.. గోద్రా అల్లర్ల మోడల్ మీకు నచ్చిందా.? నిన్న మొన్నటి వరకూ గుజరాత్ మోడల్ పై నిప్పులు చెరిగిన రేవంత్.. ఇవాళ ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే ఆయన గురించి గొప్పలు మాట్లాడుతున్నారు. ఇదేం నీతి.?.' అంటూ దుయ్యబట్టారు.తెలంగాణ మోడల్ అంటే అనేక రాష్ట్రాలు మెచ్చిన 'సమున్నత సంక్షేమ నమూనా.. సమగ్ర అభివృద్ధికి చిరునామా' అని కేటీఆర్ పేర్కొన్నారు. 'అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్. యావత్ దేశానికే నచ్చిన మోడల్. బుడి బుడి అడుగుల వయసులో బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్. అలాంటి దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా.?. నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతారా.?. తెలంగాణ దేనినైనా సహిస్తుంది. కానీ.. ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు.' కేటీఆర్ పేర్కొన్నారు.'నాడేమో తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్. నేడేమో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్. నిన్ను చరిత్ర క్షమించదు.' అంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సైతం సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏం సాధించారని మండిపడ్డారు. తమ ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోందని ఆరోపించారు. సీఎం రేవంత్ ప్రజలనే కాదని.. కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 'మీ 100 రోజుల పాలనలో ఏముంది.?. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లవ్ లెటర్ రాశారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారన్నట్లు సీఎం రేవంత్ మాట్లాడారు. తద్వారా కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ నిరంకుశమని అన్నారు. కానీ, రేవంత్ మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారు. వరికి బోనస్ ఇవ్వకుండా ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారు.?. రైతులకు ఇచ్చిన 4 హామీల విషయంలో రేవంత్ మాట తప్పారు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది.' అంటూ విమర్శించారు.

Related Posts