గుంటూరు
గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది నివాసం ఉంటున్న ప్లాట్లలో అర్ధరాత్రి వేళ పోలీసులు తనిఖీలు చేయడం కలకలం సృష్టించింది. ఎలాంటి అనుమతులు లేకుండా మంగళగిరి పట్టణ పోలీసులు బుధవారం అర్థరాత్రి ప్లాట్లకు వచ్చి ఎంత మంది సిబ్బంది ఉంటున్నారనే వివరాలు రాసుకున్నారు.పోలీసులు సోదాలు చేయడం కక్షసాధింపు చర్యేనని జనసేన నేతలు ఆరోపించారు. పోలీసులను ఉపయోగించి జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏ సమాచారం ఆధారంగా చేసుకొని తనిఖీలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక చర్యలపై తెలుగుదేశం, భాజపాలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. పోలీసుల తీరుని నిరసిస్తూ... జనసేన శ్రేణులు దాడులు జరిగిన ప్లాట్ల వద్ద నిరసన తెలిపారు. పోలీసుల వైఖరి ఆప్రజాస్వామ్య చర్యని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.