విశాఖపట్టణం, మార్చి 9
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. దీనిని నిజం చేస్తూ దశాబ్ధాల వైరాన్ని పక్కన పెట్టి అనకాపల్లి జనసేన అభ్యర్ధి , మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మరో మాజీమంత్రి, తెలుగుదేశం నేత దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. దాడి తెలుగుదేశంలో కొణతాల కాంగ్రెస్‌లో చాలా కాలం ప్రత్యర్ధులుగానే ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేసుకొన్నారు. ఒక దశలో ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ మాటలు, పలకరింపులు లేకుండానే కాలం గడచిపోయింది.2014 ఎన్నికల్లో దాడి తనయుడు రత్నాకర్ విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేయగా, కొణతాల సోదరుడు రఘునాధ్ అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఆ తరువాత వీరభద్రరావు అనకాపల్లి టికెట్ ఆశించి తెలుగుదేశంలోకి వెళ్లగా, కొణతాల జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించడంతో రాజకీయ విబేధాలను పక్కనపెట్టి దాడి వీరభద్రరావు ఇంటికి కొణతాల శుక్రవారం ఉదయం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన మద్దతు కోరారు. తెలుగుదేశం-జనసేన పార్టీ విజయం చారిత్రాత్మక అవసరం అన్నారు. రాష్ట్రం అరాచక పాలన వల్ల అధోగతి పాలవుతుందన్నారు.. భూకబ్జాదారులు సంఘ విద్రోహశక్తులు పెట్రేగిపోతున్నారన్నారు… ఇటువంటి తరుణంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దాడి వీరభద్రరావు అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఆయన మంత్రివర్గంలో పనిచేసిన రామకృష్ణ సమర్థవంతమైన పాత్ర పోషించార న్నారు. ఆ సమయంలో తాను శాసనమండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని చెప్పారు. పొత్తులో భాగంగా కొణతాలకు టికెట్టు జనసేన నుండి రావటం జరిగిందన్నారు. అందుకు అందరూ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం.. ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రామకృష్ణ గెలుపునకు సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. అలాగే జనసేన నేత, టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ… దాడి వీరభద్రరావుతో కాలేజీ నుండి అనుబంధం ఉందన్నారు. ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఏఎంఎ ఎల్ కాలేజీలో తాను చదువుకోవడం జరిగిందన్నారు. తమ కుటుంబానికి ఆయన ఆత్మీయులు అన్నారు. అయితే రాజకీయంగా విభేదించాల్సిన పరిస్థితి నెలకొందని, తిరిగి మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం ఏర్పడిందని చెప్పారు..చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన సహకారం తనకు ఎంతో అవసరమన్నారు. ముందు ముందు అన్ని విషయాలు చర్చించుకుని ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల సత్యనారాయణ, మల్ల రాజా, దాడి జగన్, ప్రభాకర్, విల్లూరి రాము, కాండ్రేగుల కృష్ణప్పారావు, బొడ్డపాటి రాజారావు, బుడ్డెద శంకరరావు, కోటిపల్లి జేజి బాబు, పెద్ద ఎత్తున జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 40 ఏళ్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని నేతలు ఇప్పుడు కలిసి పనిచేయాలని నిర్ణయిం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పూర్తిస్థాయిలో కొణతాల కోసం పనిచేస్తానని దాడి వీరభద్రరావు ప్రకటించారు. ఇది అనకాపల్లి జిల్లా రాజకీయాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఆసక్తికర పరిణామంగా మారింది.