విశాఖపట్టణం, మార్చి 9
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. భీమిలి నుంచి పోటీ చేసేందుకు గంటా ఉవ్విళూరుతుంటే.. చంద్రబాబు మాత్రం గంటాను చీపురుపల్లికే పంపించాలని భావిస్తున్నారు. రెండు రోజులు కిందట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన గంటాకు మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో గంటా కూడా అక్కడి పరిస్థితులపై సమాచారాన్ని తెప్పించుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీలో సీనియర్ నేతగా, విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బొత్సను ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌గా కిమిడి నాగార్జున ఉన్నారు. యువకుడైన నాగార్జున జోరుగా జనాల్లోకి వెళుతున్నారు. కానీ, ఆర్థిక, అంగ బలం కలిగిన బొత్సను ఢీకొట్టాలంటే అంతటి బలమైన నేతను బరిలో దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. విజయనగరం జిల్లాలో అంతటి బలమైన నేత లేకపోవడంతో చంద్రబాబు ఏరికోరి మరీ గంటాను అక్కడికి పంపించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా రాజకీయాలను బొత్స సత్యనారాయణ ఒక రకంగా శాసిస్తున్నారనే చెప్పాలి. బొత్స కుటటుంబానికి ఢీ అంటే ఢీ అనే స్థాయిలో నిలబడే సామర్థ్యం కలిగిన నేతలు తెలుగుదేశం పార్టీలో లేరని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఉన్నప్పటికీ.. తన పని తాను చేసుకోవడమే తప్పా రాజకీయంగా బొత్స కుటుంబాన్ని తీవ్రంగా ఎదిరించే తత్వం ఆయనది కాదు. మిగిలిన నేతలంతా నియోజకవర్గాలకు పరిమితమైన వారే తప్పా.. జిల్లా రాజకీయాలను చూసేంత సామర్థ్యం వారికి లేదు. ఈ నేపథ్యంలోనే పొరుగు జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావును బరిలోకి దించడం ద్వారా రానున్న రోజుల్లో విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతను అక్కడి ఉంచాలన్న లక్ష్యం చంద్రబాబుదిగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే బొత్సకు పోటీగా గంటాను పంపిస్తున్నారు. బొత్సపై విజయం సాధిస్తే.. భవిష్యత్‌లో విజయనగరం జిల్లా రాజకీయాలను పూర్తిగా శాసించే అవకాశం గంటాకు దక్కుతుంది.చంద్రబాబు లెక్కలు ఇలా ఉంటే.. గంటా మాత్రం మరోలా లెక్కలు వేసుకుని అక్కడకు వెళ్లేందుకు సాహసం చేయడం లేదు. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సకు బలమైన అనుచర గణం ఉంది. చీపురుపల్లి నుంచి సిటింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ఇక్కడే ఎక్కువగా రాజకీయాలు నెరుపుతుంటారు. ముఖ్యమైన నేతలంతా ఇక్కడే వైసీపీకి ఉండడంతో వారిని ఎదురొడ్డి బొత్సను ఓడించడం సాధారణ విషయం కాదన్న భావనతో ఉన్న గంటా.. అక్కడికి వెళ్లేందుకు సుముఖతను వ్యక్తం చేయడం లేదు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా ఉన్న తన రికార్డులకు ఇబ్బంది కలిగించే ప్రమాదం అక్కడి వెళితే ఉంటుందన్న భావన గంటా ఉండడం వల్లే వెనక్కి తగ్గుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. చీపురుపల్లికి వెళ్లి పోటీ చేయాలని అధిష్టానం పదే పదే చెబుతుండడంతో క్షేత్ర స్థాయిలో రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడంపై గంటా దృష్టి సారించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంతోపాటు విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడి స్థానిక పరిస్థితులు, పార్టీ బలం, బలహీనతలు వంటి అంశాలపై ఒక లెక్కకు వచ్చారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్‌ను తెలుసుకునే ఉద్ధేశంతో సర్వే బృందాన్ని అక్కడికి పంపించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం గంటాకు చెందిన టీమ్ అక్కడి గ్రౌండ్ లెవెల్‌లో తిరుగుతూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడి వ్యాపారులు, బీసీ కుల సంఘాలు, కాపు నేతలతో మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. ఇక్కడి విజయం సాధించాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపైనా సదరు సర్వే టీమ్ దృష్టి సారించి సమాచారాన్ని సేకరిస్తోంది. సర్వే బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా గంటా నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఓటమి ఎరుగని నేతగా రాజకీయాలు సాగిస్తున్న గంటాకు.. వచ్చే ఎన్నికలకు పెద్ద చిక్కునే తెచ్చి పెట్టాయని చెబుతున్నారు.