విజయవాడ, మార్చి 9,
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారును వేగవంతం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్.. వివిధ సర్వేల ఆధారంగా నేతలకు టికెట్లు ఖరారు చేస్తున్నారు. కొంతమంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తుండగా.. వారి నియోజకవర్గాల్లో వేరేవారిని ఇంచార్జ్‌లుగా నియమిస్తున్నారు. ఇక మరింతకొంతమంది ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన 11 జాబితాల్లో 75 అసెంబ్లీ, 23 ఎంపీ స్థానాలను వైసీపీ ఇంచార్జ్‌లను ప్రకటించింది. 175కి 175 స్థానాలు గెలుచుకోవాలని పదే పదే చెబుతున్న జగన్.. రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఐ ప్యాక్‌తో పాటు వివిధ సర్వే సంస్థల నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. గెలుపు అవకాశాలు ఉండే నేతలకు మాత్రమే టికెట్లు ప్రకటిస్తున్నారు. లేకపోతే టికెట్లు ఇచ్చేది లేదని నేరుగా చెప్పేస్తున్నారు. టికెట్ దక్కని నేతలకు పార్టీలో కీలక పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. కానీ టికెట్ దక్కలేదనే అసంతృప్తితో నేతలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నష్టం జరగుతుందని పార్టీ శ్రేణులు ఆందోనన చెందుతున్నారు. అభ్యర్థులను ఖరారు చేస్తూనే.. మరోవైపు సిద్దం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తూ సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇప్పటికే నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తూ 10 జాబితాలు విడుదల చేయగా.. శుక్రవారం రాత్రి 11వ జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఇందులో మూడు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను ప్రకటించారు.తాజా జాబితాలో రెండు పార్లమెంట్, ఒక్క అసెంబ్లీ స్థానానికి సమన్వయకర్తలను నియమించారు. కర్నూలు పార్లమెంట్ ఇంచార్జ్‌గా బీవై రామయ్య, అమలాపురం లోక్‌సభ స్థానం ఇంచార్జ్‌గా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావులను నియమించారు. దీనితో కలిపి ఇప్పటివరకు 11 జాబితాల్లో నియోజకవర్గ ఇంచార్జ్‌లను ప్రకటించారు. వైసీపీకి చెందిన కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలలో చేరారు. ఈ జాబితాల ద్వారా ఖాళీ అయిన స్థానాలకు ఇంచార్జ్‌లను నియమిస్తున్నారు. ఇంచార్జ్‌లకే దాదాపు వచ్చే ఎన్నికల్లో సీటు ఖరారు చేసే అవకాశముంది. సీటు దక్కని నేతలు అసంతృప్తితో వేరే పార్టీలలో చేరుతున్నారు. దీంతో ఇటీవల టీడీపీ, జనసేనలోకి వైసీపీ నుంచి వలసలు పెరిగిపోతున్నాయి.ఇక శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉదయం రెండు స్థానాలకు టీడీపీ ఇంచార్జ్‌లను నియమించింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా గోరంట్ల రవికుమార్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి ముక్కా రూపానందరెడ్డిలను నియమించింది. దీనికి సంబంధించి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన క్రమంలో బీజేపీతో పొత్తు దాదాపు ఖాయమైందని, రేపో, మాపో ఎన్డీయేలో టీడీపీ చేరుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రెండు స్థానాలకు టీడీపీ ఇంచార్జ్‌లను ప్రకటించడం కీలకంగా మారింది.