ఏపీ విభజన బిల్లు అంశాన్ని, కర్ణాటక రాజకీయ పరిణామాలను ముడి పెడుతూ మాట్లాడారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. లోక్‌సభలో ఏపీ విభజన బిల్లు ఆమోదం పొందిన నాటి పరిస్థితులను ప్రస్తావిస్తూ.. కర్ణాటకలో బీజేపీ వెనక్కు తగ్గడానికి కారణం సభా సమావేశాన్ని లైవ్ ఇవ్వడమే అని ఉండవల్లి అన్నారు. ఆ నాడు లైవ్ టెలికాస్ట్‌ను ఆపించి, లోక్‌సభ తలుపులు మూసి.. ఏపీ విభజన బిల్లు పాస్ అయిపోయిందని యూపీఏ ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌లు ప్రకటించారని ఉండవల్లి అన్నారు. వాస్తవానికి విభజన బిల్లుపై చర్చనాడు బలాబలాలను చూస్తే.. ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశమే లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఆ రోజున సమావేశానికి హాజరైన ఎంపీల మొత్తం సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. విభజన బిల్లు పాస్ కాలేదని.. పాస్ అయినట్టుగా ప్రకటించేశారని అన్నారు. ఒకవేళ విభజన బిల్లుపై ఓటింగ్ సమయంలో లైవ్ టెలికాస్ట్ ఉండి ఉంటే.. ప్రకటించేయడానికి వీలు ఉండేది కాదన్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప బలనిరూపణ సమయంలో సుప్రీం కోర్టు లైవ్ టెలికాస్ట్ తప్పనిసరి చేసిందని, దీని వల్ల బీజేపీ బలనిరూపణ చేసుకున్నట్టుగా ప్రొటెంస్పీకర్ ప్రకటన చేయడానికి అవకాశం లేకపోయిందన్నారు. ఒకవేళ మొన్న కర్ణాటక విధాన సౌధలో లైవ్ టెలికాస్ట్ లేకపోయుంటే.. బలనిరూపణ జరిగినట్టుగా, యడ్యూరప్ప నెగ్గినట్టుగా ప్రకటించుకున్నా ఆపేవారు లేరన్నారు. ఏపీ విభజన బిల్లు విషయంలో అదే జరిగిందని, కర్ణాటక వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యంతో కథ మారిందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు విభజన బిల్లు విషయంలో ఇంకేం చేయలేమని.. అయితే జరిగిన అన్యాయాన్ని మాత్రం ఏపీ ఎంపీలు ప్రస్తావించాలని, ఢిల్లీలో సదస్సులు నిర్వహించి.. ఈ అంశాన్ని అందరి వద్దకూ తీసుకెళ్లాలని ఉండవల్లి అన్నారు.