న్యూఢిల్లీ మార్చ్ 9
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పొత్తులో బీజేపీ కూడా కలవబోతున్నట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ శనివారం చర్చలు జరిపారు. టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తుపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.అయితే పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జనసేన 2 స్థానాల్లో బరిలో దిగనున్నట్లు సమాచారం. ఇక మిగిలిన 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో తెలుగు దేశం పోటీ చేయనుంది. ఇక 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన 24 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాన్, చంద్రబాబు కలిసి ప్రకటించారు. తాజాగా బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన 145 స్థానాల్లో టీడీపీనే బరిలో దిగనుంది. అయితే బీజేపీ వైజాగ్, విజయవాడ, అరకు, రాజంపేట్, రాజమండ్రి, తిరుపతి స్థానాలపై దృష్టి పెట్టింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు కైవసం చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటోంది బీజేపీ.అమిత్ షాతో సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజకీయాలపై చంద్రబాబు, పవన్ చర్చించారు. ఈ చర్చల సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అవసరమని టీడీపీ భావిస్తోంది. ఏపీ, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.