నెల్లూరు, మార్చి 11
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఒకటి. జిల్లాలో ఈ నియోజకవర్గం చాలా ప్రత్యేకమైనది. కృష్ణపట్నం పోర్టు సహా నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు ఇండస్ట్రియల్ ఏరియా అంతా ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెల్లూరు నగరంలో కూడా ఈ స్థాయిలో భూముల ధరలు ఉండవంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాయకులు శాయశక్తులు ఒడ్డుతారు. ఎందాకైనా ప్రయత్నం చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి హాట్ సీట్ లాంటిది. ప్రస్తుతం ఇక్కడ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా ఆయనే ఇక్కడ వైసీపీ తరపున పోటీలో నిలుస్తారు. టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు క్లారిటీ లేదు. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు నగరం చుట్టూ విస్తరించి ఉంటుంది. నెల్లూరు అర్బన్, రూరల్ నియోజకవర్గాలతోపాటు, కోవూరు, ఆత్మకూరు, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలతో సరిహద్దుని పంచుకుంటుంది. జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 229,109 కాగా.. అందులో పురుషులు 111,496 మంది, మహిళా ఓటర్లు 117,613 మంది. బెగోరె గా చిరపరిచితులైన ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం సర్వేపల్లి. 1955లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యే అయ్యారు. సీపీఐ అభ్యర్థి కె.బి.రెడ్డిపై 14,622 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, వైఎస్సార్సీపీ, ఇండిపెండెంట్లు కూడా గెలవడం విశేషం. అంటే ఇండిపెండెంట్ తో సహా దాదాపు అన్ని పార్టీల వారిని ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారన్నమాట. ఇది జనరల్ నియోజకవర్గం అయినా కూడా రెండుసార్లు ఎస్సీ నేతలు ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించడం విశేషం. 1967లో సీపీఐ తరపున స్వర్ణ వేమయ్య ఎమ్మెల్యే కాగా, 1972లో కాంగ్రెస్ తరపున మంగళగిరి నానాదాస్ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో సర్వేపల్లిలో కూడా ఎన్టీఆర్ హవా కనపడింది. 1983లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పెంచలరెడ్డి చెన్నారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1994, 1999లో వరుసగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. అయితే ఆ తర్వాత సోమిరెడ్డి ఇక్కడ వరుస ఓటములు ఎదుర్కొంటున్నారు. వరుసగా నాలుగుసార్లు ఆయన సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయి రికార్డు సృష్టించారు. 2004, 2009లో ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2019లో కాకాణి గోవర్దన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం ఆయన జగన్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో సోమిరెడ్డి కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. వరుస పరాజయాలతో డీలాపడ్డ సోమిరెడ్డి టీడీపీ తరపున సర్వేపల్లిలో మరోసారి బరిలో నిలుస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఆయన్ను కాదని, కొత్తగా టీడీపీలో చేరిన రూప్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. అటు వైసీపీ నుంచి మాత్రం కాకాణికి టికెట్ ఖాయమని తేలినా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మొత్తమ్మీద ఈసారి పోరు రసవత్తరంగా మారే అవకాశముంది. మంత్రిగా ఉన్న కాకాణి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజల్లో ఉండేలా ఆయన కార్యాచరణ రూపొందించుకున్నారు. 2024 సర్వేపల్లి హాట్ సీట్ ఎవరికి వరిస్తుందో చూడాలి.